ఘోరం.. చిన్నారుల‌పై నుంచి దూసుకెళ్లిన స్కూల్ బ‌స్సు.. ఒక‌రి మృతి

Road accident at Ibrahimpatnam One student dead.ఓ స్కూల్ బ‌స్సు మృత్యువు రూపంలో దూసుకువ‌చ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sept 2022 3:06 PM IST
ఘోరం.. చిన్నారుల‌పై నుంచి దూసుకెళ్లిన స్కూల్ బ‌స్సు.. ఒక‌రి మృతి

రోజులాగానే త‌ల్లిదండ్రులకు బాయ్ అని చెప్పిన ఇద్ద‌రు చిన్నారులు పాఠ‌శాలకు బ‌య‌లుదేరారు. అయితే.. ఓ స్కూల్ బ‌స్సు మృత్యువు రూపంలో దూసుకువ‌చ్చింది. న‌డుచుకుంటూ వెలుతున్న విద్యార్థుల‌ను ఢీ కొట్టింది. దీంతో ఓ విద్యార్థి అక్కడిక‌క్క‌డే మృతి చెంద‌గా మ‌రో విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలోని ఇబ్ర‌హీంప‌ట్నం మున్సిప‌ల్ ప‌రిధిలోని శేరిగూడ వ‌ద్ద మంగ‌ళ‌వారం ఉద‌యం చోటు చేసుకుంది.

ప్ర‌మాదం అనంత‌రం బ‌స్సును అక్క‌డే వ‌దిలివేసి డ్రైవ‌ర్ ప‌రారు అయ్యాడు. మృతి చెందిన విద్యార్థిని త‌ల్లిదండ్రులు స్థానికులు కాద‌ని బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా తెలుస్తోంది. వారు స్థానిక రైస్ మిల్లులో హ‌మాలీ ప‌నులు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. త‌మ చిన్నారి మృతి చెంద‌డంతో త‌ల్లిదండ్రుల రోద‌న వ‌ర్ణ‌నాతీతంగా మారింది. చిన్నారి మృత‌దేహాంతో త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు సాగ‌ర్ హైవే బైఠాయించారు. దీంతో ర‌హ‌దారిపై ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు. వారికి న‌చ్చ‌జెప్పి వాహ‌నాల రాక‌పోక‌ల‌ను పున‌రుద్ద‌రించారు. ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story