ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన జైనథ్ మండలం బోరెజ్ చెక్‌పోస్ట్ వద్ద చేటుచేసుకుంది. దీంతో ఆగ్రహాం వ్యక్తం చేసిన స్థానికులు బోరెజ్ చెక్ పోస్టుపై దాడి చేసి అక్కడ ఉన్న సామాగ్రి ధ్వంసం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు.
వివరాల్లోకి వెళ్తే.. జైనథ్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న పద్మ విధులకు హాజరయ్యేందుకు శుక్రవారం ఉదయం తన ద్విచక్రవాహనంపై ఆదిలాబాద్ నుంచి బయలుదేరారు. బోరెజ్ చెక్‌పోస్ట్ వద్ద బారికేడ్లు ఉండడంతో అటువైపు నుంచి వస్తున్న ట్రక్కు పద్మ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఉపాధ్యాయులు మృతి చెందడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
వరుసగా మూడు రోజుల్లో ముగ్గురు చనిపోయినా అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. బోరెజ్ చెక్‌పోస్ట్‌పై దాడి చేసి సామాగ్రి ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు వారిని అదుపుచేసేందుకు శ్రమించాల్సి వచ్చింది. స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదాలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వారికి నచ్చజెప్పిన పోలీసులు ఆందోళనను విరమింపజేశారు.