బీహార్‌లోని రోహతాస్ జిల్లాలో 500 టన్నుల వంతెన చోరీ కేసులో 6 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఆర్జేడీ నేత కూడా ఉన్నారు. వారి వద్ద నుంచి గ్యాస్ కట్టర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారందరినీ విచారిస్తున్నట్లు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఎస్‌డిపిఓ శశిభూషణ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నీటిపారుదల శాఖ సీజనల్ ఉద్యోగి అరవింద్ కుమార్, ఆర్జేడీ నేత శివకళ్యాణ్ భరద్వాజ్, చందన్ కుమార్, సచ్చిదానంద్ సింగ్, మనీష్ కుమార్, గోపాల్ కుమార్‌లను అరెస్టు చేశారు. నీటిపారుదల శాఖ ఉద్యోగి అరవింద్ వాహనంలో వంతెన సామాగ్రిని ఒకచోటి నుంచి మరోచోటికి తరలించినట్లు పోలీసులు గుర్తించారు.
రోహ్‌తాస్ జిల్లాలో 60 అడుగుల పాడుబడిన వంతెనను పట్టపగలు దొంగిలించేశారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులుగా నటిస్తూ గ్యాస్ కట్టర్లు, ఎర్త్ మూవర్ మిషన్లతో వంతెనను కూల్చివేసి వాటితో పరారైనట్లు వార్తలు వచ్చాయి. కొందరు జేసీబీ, గ్యాస్ కట్టర్ వంటి యంత్రాలతో వంతెనను కూల్చివేశారని గ్రామస్తులు తమకు సమాచారం అందించారని నీటిపారుదల శాఖ జూనియర్ ఇంజనీర్ అర్షద్ కమల్ షంషీ తెలిపారు. తాము ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశామని షంషీ తెలిపారు. 60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తున్న వంతెన ఒక్కసారిగా మాయమైపోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ శాఖ అధికారులు నస్రీగంజ్ పోలీస్ స్టేషన్‌లో దొంగలపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 1972లో అమియావర్‌లోని ఆరా కాలువపై వంతెన నిర్మించబడింది.