హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన ఒక రిటైర్డ్ జిల్లా జడ్జి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి ఏకంగా రూ. 1 కోటి కంటే ఎక్కువ మొత్తాన్ని పోగొట్టుకున్నారు. గత వారం రోజులుగా "డిజిటల్ అరెస్ట్" పేరుతో మోసగాళ్లు ఆయనను తీవ్రంగా భయపెట్టారు.
బాధితుడి మొబైల్ నంబర్ ద్వారా మహిళల అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరాలు జరుగుతున్నాయని, విచారణ ఎదుర్కోవాలని నమ్మించి సైబర్ దొంగలు ఆయనను మానసిక ఒత్తిడికి గురిచేశారు. చట్ట అమలు సంస్థల అధికారులమని చెప్పుకుంటూ ఫోన్ చేసిన నేరగాళ్ల బెదిరింపులకు భయపడి, ఆయన తన వద్ద ఉన్న కోటి రూపాయలకు పైగా నగదును వారి ఖాతాలకు బదిలీ చేశారు.
తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక జిల్లా జడ్జి స్థాయి వ్యక్తి కూడా ఇలా మోసపోవడంపై పోలీసులు స్పందిస్తూ.. నేరగాళ్లు సృష్టించే భయాందోళనల వల్ల బాధితులు తమ విచక్షణను కోల్పోతారని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.