కృష్ణా జిల్లా పెనమలూరు పరిధిలో ఒక రిటైర్డ్ బ్యాంక్ అధికారి సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడి భారీగా నష్టపోయారు. కానూరుకు చెందిన విజయానంద్ (యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి) ఫేస్‌బుక్‌లో పెట్టుబడి సలహాలకు సంబంధించిన ఒక ప్రకటన చూసి మోసగాళ్లను సంప్రదించారు. వారు అతడిని ఒక వాట్సాప్ గ్రూపులో చేర్చి, షేర్ మార్కెట్‌లో తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు విడతల వారీగా రూ. 22.20 లక్షలు పెట్టుబడి పెట్టారు.
అనంతరం, మోసగాళ్లు ఒక నకిలీ యాప్ ద్వారా అతడికి రూ. 1.11 కోట్ల లాభం వచ్చినట్లు నమ్మబలికారు. ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే సర్వీస్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాలని కోరారు. దీంతో బాధితుడు మరో రూ. 33 లక్షలు (ప్రాసెసింగ్ ఛార్జీలు రూ. 23.50 లక్షలు, ఇతర ఫీజులు రూ. 9.50 లక్షలు) వారి ఖాతాలకు బదిలీ చేశారు. మొత్తం రూ. 55.20 లక్షలు చెల్లించిన తర్వాత కూడా లాభం రాకపోగా, నిందితుల ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయానని విజయానంద్ గ్రహించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.