కమ్మరి కృష్ణను చంపింది కొడుకే.. ఎలా కనుగొన్నారంటే.?

హైదరాబాద్ లో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తింపు పొందిన కమ్మరి కృష్ణను కొందరు దుండగులు ఇటీవల హత్య చేశారు.

By Medi Samrat  Published on  13 July 2024 10:00 AM GMT
కమ్మరి కృష్ణను చంపింది కొడుకే.. ఎలా కనుగొన్నారంటే.?

హైదరాబాద్ లో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తింపు పొందిన కమ్మరి కృష్ణను కొందరు దుండగులు ఇటీవల హత్య చేశారు. షాద్ నగర్ లోని తన ఫాంహౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కత్తులతో కిరాతకంగా నరికి చంపారు. అయితే ఈ హత్య కేసును చేధించిన పోలీసులే కన్న కొడుకే చంపేశాడని తేల్చారు. షాద్ నగర్ పోలీసులు హత్యకు కారణమైన నలుగురు నిందితులను హైదరాబాద్ లోని జాగీర్ బండ్లగూడ వద్ద గల కాళీ మందిర్ చౌరస్తాలో అరెస్టు చేశారు. వారి నుండి రెండు ఫోర్ వీలర్ వాహనాలు, ఒక టూ వీలర్ వాహనం, మూడు పదునైన కత్తులు, ఒక సెల్ ఫోన్, 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

మృతుడు కమ్మరి కృష్ణకు ముగ్గురు భార్యలు ఉన్నారని మొదటి భార్య విజయలక్ష్మి కృష్ణతో విడిపోయి వేరుగా ఉంటుంది. ఆమెకు ఇద్దరు కుమారులు మొదటి కుమారుడు శివ (35) రెండవ కుమారుడు సాయి కిరణ్ (26) ఉన్నారు. మొదటి భార్య విజయలక్ష్మి మొదటి కుమారుడైన శివకు కమ్మరి కృష్ణకు ఆస్తిపరమైన వివాదాలు తలెత్తాయని, దీంతో ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు తెలిపారు. అయితే కమ్మరి కృష్ణ ఈ మధ్యనే తన మూడో భార్య పావని పేరు పైన 16 కోట్ల విలువైన ఆస్తులు, కేకే ఫంక్షన్ హాల్ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కొడుకు శివకు తెలిసింది. ఈ విషయంపై కక్ష పెంచుకున్న శివ ఎలాగైనా తన తండ్రి ని హత మార్చితే ఆయన ఆస్తులని తనకే చెందుతాయని భావించాడు. ఈ హత్యకు తన తండ్రి బాడీగార్డ్ బాబా శివానంద్ తో హత్యకు ప్రణాళిక వేశాడు.

శివ తన తండ్రిని హత్య చేసేందుకు బాబాకు 25 లక్షల సుపారి ఇచ్చాడు. ముందుగా 2 లక్షల అడ్వాన్స్, ఒక ఇల్లు కట్టిస్తానని హత్యకు ఒప్పందం చేసుకున్నాడు. పక్కా ప్రణాళికలో భాగంగానే ఈనెల 10వ తేదీన కమ్మరి కృష్ణ రిసార్ట్ లో ఉండగా.. బాబా శివానంద్ సాయంత్రం 5.30 గంటలకు బాబా, జీలకర్ర గణేష్ ఆలియాస్‌ లడ్డు, మైనర్ బాలుడితో అక్కడికి చేరుకున్నారు. జీలకర్ర గణేష్, మైనర్ బాలుడు ఇద్దరు కలిసి కమ్మరి కృష్ణ చేతులు వెనక్కి పట్టుకోగా... బాబా తనతో పాటు తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి, పొట్టలో పొడిచి పరారయ్యారు. అతని అరుపులు విని పైఅంతస్తులో ఉన్న భార్య కృష్ణను శంషాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ హత్యపై మృతుడు కమ్మరి కృష్ణ మూడో భార్య పావని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు.

పావని పోలీసులకు కంప్లైంట్ చేయగా విచారణ చేపట్టిన పోలీసులు కేవలం రెండు రోజుల్లోనే హత్యకు సంబంధించిన కారణాలను శోధించి, హత్యకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. నిందితులు హత్యకు ఉపయోగించిన కారు నెం. TS 07 EK 3154, శివ, బాబా కలుసుకో వడానికి ఉపయోగించిన TS 07 EQ 0001 కారు, ఒక టూ వీలర్ వాహనాన్ని, మూడు పదునైన కత్తులను, 50వేల రూపాయలను నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్ కు తరలించారు.

Next Story