సీఎం జగన్‌కు లేఖ రాసి.. స్థిరాస్తి వ్యాపారి ఆత్మహత్య
Realtor Commits suicide in Hyderabad.ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు తీసుకున్న అప్పులు చెల్లించినా వేధింపులకు
By తోట వంశీ కుమార్ Published on 4 Aug 2022 12:40 AM GMTఓ వైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు తీసుకున్న అప్పులు చెల్లించినా వేధింపులకు పాల్పడుతూ ఉండడంతో ఓ స్థిరాస్తి వ్యాపారి మనస్థాపం చెందాడు. సీఎం జగన్‌ను అడ్రస్ చేస్తూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరులోని కొరిటెపాడుకు చెందిన చెన్నంరాజు గిరిధర వర్మ(40) స్థిరాస్తి వ్యాపారి. వ్యాపార నిమిత్తం మూడు నెలల క్రితం హైదరాబాద్‌లోని ఏఎస్‌రావునగర్‌లోని ఆదిత్యనగర్‌కు వచ్చి అద్దె గదిలో ఉంటున్నాడు. బుధవారం ఆయన భార్య ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఎత్తలేదు. దీంతో ఆమె ఇంటి సమీపంలోని బంధువులకు సమాచారం ఇచ్చింది. తలుపులు మూసి ఉండడంతో వారు వచ్చి కిటిలోంచి చూడగా ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తలుపులు పగులకొట్టి అతడి మృతదేహాన్ని కిందకు దింపారు. ఘటనా స్థలిలో సూసైడ్ నోటు దొరికింది.
వ్యాపారం కోసం గుంటూరు కు చెందిన వెంకట్‌రెడ్డి నుంచి రూ.5లక్షలు తీసుకున్నా. వడ్డీతో సహా తిరిగి చెల్లించా. అయినప్పటికీ ప్రామిసరీ నోటు ఇవ్వడం లేదు. ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నాడు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వెంకట్ రెడ్డి బెదిరించాడు. అతడి వేధింపులను భరించలేక తీవ్ర ఒత్తిడికి లోనయ్యా. ఆత్మహత్య చేసుకుంటున్నాను. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నా. సీఎం జగన్ గారు నా మనవిని అర్థం చేసుకోండి అని గిరిధర్ సూసైడ్ నోట్‌లో రాశారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.