హైదరాబాద్: భార్య ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన వ్యక్తికి ఇబ్రహీంపట్నం కోర్టు మంగళవారం నాడు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉడుగుల అరుణ అనే మహిళకు ఇబ్రహీంపట్నం కొంగర కలాన్ గ్రామానికి చెందిన ఉడుగుల శ్రీనివాస్ తో 2001లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లైన కొంతకాలం వరకు వీరి సంసారం బాగానే ఉంది. పిల్లలు పుట్టిన తర్వాత అరుణను శ్రీనివాస్ వేధింపులకు గురి చేశాడు.
మరింత కట్నం కోసం అరుణను శ్రీనివాస్ ఆమెను నిత్యం వేధించేవాడు. ఆమె పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసేవాడు. ఈ క్రమంలోనే 2016 డిసెంబర్ 28న అరుణ తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె డిసెంబర్ 29, 2016న పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. 2017 జనవరి 10న ఆమె మృతి చెందగా, ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేసి శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. కాగా 2023 మార్చి 21వ తేదీ మంగళవారం రోజున విచారణ సందర్భంగా శ్రీనివాస్‌కు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.4000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.