ఓరి దుర్మార్గుడా.. క‌డుపుతో ఉన్న కూతురిని ఆటోతో తొక్కించి చంపే య‌త్నం

Rajasthan Man Tries To Crush Pregnant Daughter To Death With His Auto.ఇటీవ‌ల ప‌రువు హ‌త్య‌లు ఎక్కువ అయిపోతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2022 12:20 AM GMT
ఓరి దుర్మార్గుడా.. క‌డుపుతో ఉన్న కూతురిని ఆటోతో తొక్కించి చంపే య‌త్నం

ఇటీవ‌ల ప‌రువు హ‌త్య‌లు ఎక్కువ అయిపోతున్నాయి. పేగు బంధం కంటే స‌మాజంలోని ప‌రువుకే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు కొంద‌రు. త‌మ మాట కాద‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అన్న కోపంతో పేగు బంధాన్ని మ‌రిచి జ‌న్మ‌నిచ్చిన వారే.. త‌మ వారి ప్రాణాలు తీసేందుకు వెనుకాడ‌డం లేదు. త‌మ కంటే త‌క్కువ కులం వాడిని కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుంద‌న్న కోపంతో ఓ వ్య‌క్తి కూతురిపైకి ఆటో ఎక్కించ‌బోయాడు. ఈ దారుణ ఘ‌ట‌న రాజ‌స్థాన్ లో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. భ‌ర‌త్‌పూర్‌కు చెందిన న‌గ్మా అదే గ్రామానికి చెందిన న‌రేంద్ర ప్రేమించుకున్నారు. కొద్ది రోజులు త‌రువాత ఈ విష‌యం ఇద్ద‌రి ఇళ్ల‌లోనూ తెలిసింది. ఇద్ద‌రివి వేర్వేరు కులాలు కావ‌డంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీక‌రించ‌లేదు. దీంతో న‌గ్మా, న‌రేంద్ర‌లు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఏడు నెల‌ల పాటు వేరు వేరు ప్రాంతాల్లో ఉండి ఇటీవ‌లే భ‌ర‌త్‌పూర్‌కు వ‌చ్చారు. ప్ర‌స్తుతం న‌గ్మా గ‌ర్భ‌వ‌తి.

త‌న కుమారై ఇలా చేయ‌డాన్ని న‌గ్మా తండ్రి జీర్ణించుకోలేక‌పోయాడు. ప‌గ‌తో ర‌గిలిపోయాడు. అదును కోసం వేచి చూస్తున్నాడు. కూతురు, అల్లుడు భ‌ర‌త్‌పూర్‌కు వ‌చ్చార‌ని తెలుసుకున్న న‌గ్మా తండ్రి వారిని అంతం చేయాల‌ని ప్లాన్ చేసుకున్నాడు. బుధ‌వారం ఆస్ప‌త్రికి వెలుతున్న న‌గ్మా, న‌రేంద్ర‌ను ఆటోతో తొక్కించడానికి య‌త్నించాడు. దీన్ని గ‌మ‌నించిన న‌గ్మా, న‌రేంద్ర‌లు ప‌రుగులు తీశారు. ఓ చేత్తో క‌డుపు ప‌ట్టుకుని రోడ్డు న‌గ్మా అరుస్తూ ప‌రిగెడుతున్న తీరు అక్క‌డి వారిని కంట‌త‌డి పెట్టించాయి. జ‌నాలు రావ‌డంతో న‌గ్మా తండ్రి అక్క‌డి నుంచి ప‌రారు అయ్యాడు. ఈ ఘ‌ట‌న మొత్తం అక్క‌డి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దీనిపై బాధితులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేస్తున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Next Story
Share it