రూట్ మార్చిన వ్యభిచార ముఠాలు..ఏకంగా శ్మశానంలోనే దందా

నగరంలోని బేగంపేటలో విస్తుపోయే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

By -  Knakam Karthik
Published on : 13 Sept 2025 3:46 PM IST

Crime News, Hyderabad, Begumpet, Prostitution

హైదరాబాద్‌లో వ్యభిచార ముఠాలు రూట్ మార్చాయి. ఇంతకాలంగా నగరంలోని హోటళ్లు, ఇళ్లలో వ్యభిచార గృహంగా మార్చి దందా కొనసాగించే వ్యవహారం గురించి వార్తా పత్రికల్లో చూస్తూనే ఉంటారు. కానీ నగరంలోని బేగంపేటలో విస్తుపోయే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పవిత్రంగా భావించే శ్మశాన వాటికనే కొందరు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా శ్మశానంలోనే వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

బేగంపేట పరిధిలోని శ్యాం లాల్ బిల్డింగ్స్ సమీపంలో ఉన్న ఒక శ్మశాన వాటికలోని గదిని, పరిసర ప్రాంతాలను అడ్డాగా చేసుకుని ఈ దందా సాగుతోంది. పోలీసుల కథనం ప్రకారం, మాధవి అనే మహిళ ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. యువతులను ఇక్కడికి తీసుకొచ్చి, విటులను ఆకర్షిస్తూ కొన్నాళ్లుగా ఈ దందాను నడిపిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ద్వారా విషయం తెలుసుకున్న బేగంపేట పోలీసులు పక్కా ప్రణాళికతో ఆ శ్మశాన వాటికపై దాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలు మాధవితో పాటు మరో యువతిని, ఒక విటుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విటుడిగా పట్టుబడిన వ్యక్తిని సివిల్ కాంట్రాక్టర్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు వివరించారు.

Next Story