గర్భిణీ ఆత్మహత్య.. 'అతడో రాక్షసుడు.. నా శవాన్ని తాకే అర్హత వారికి లేదు'
Pregnant woman hangs herself in Hyderabad.అనుమానం పెను భూతం అంటారు. అనుమానం కారణంగా కొందరు వారి పచ్చని కాపురాల్లో
By తోట వంశీ కుమార్ Published on 4 Aug 2022 9:59 AM IST
అనుమానం పెను భూతం అంటారు. అనుమానం కారణంగా కొందరు వారి పచ్చని కాపురాల్లో చేజేతులా నిప్పులు పోసుకుంటున్నారు. భార్య ఎవరితోనూ మాట్లాడడానికి వీలులేదని భర్త హుకుం జారీ చేశాడు. పొరబాటున ఎవరితోనైనా మాట్లాడిందా అంతే చిత్ర హింసలకు గురి చేసేవాడు. భర్త వేదింపులు రోజు రోజుకు తీవ్రం అవుతుండడంతో మూడు నెలల గర్భిణీ బలవన్మరణానికి పాల్పడింది. తన మృతదేహాన్ని భర్త ముట్టుకోకుండా చూడాలని సూసైడ్ నోట్‌లో రాసింది. ఈ ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. షాహిన్‌నగర్ జుబైద్ కాలనీలో ఉండే ఫిర్దోస్ అన్సారీ(29)కి చార్మినార్ ఫతేదర్వాజాకు చెందిన సుల్తాన్ పటేల్ అనే వ్యక్తితో ఫిబ్రవరి1, 2021లో వివాహమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న సుల్తాన్ పటేల్ ఎవ్వరితో మాట్లాడనిచ్చేవాడు కాదు. ఎవరితోనైనా మాట్లాడితే బెల్టు, కర్రతో చితకబాదేశాడు. ఆఖరికి ఆడబిడ్డ భర్త, అతడి కుమారుడితో మాట్లాడినా అనుమానించి ఇష్టమొచ్చినట్లు కొడుతుండేవాడు. ఈ విషయాలను ఎవరికైనా చెబితే చంపేస్తానని, ఏకాంత దృశ్యాలు అందరికి చూపిస్తానని భయపెట్టేవాడు. రెండు సార్లు గర్భస్త్రావం అయితే ఆనంద పడ్డాడు. ఈ విషయాలను అన్నింటిని అన్సారీ తన డైరీలో రాసింది.
ప్రస్తుతం ఫిర్దోస్ అన్సారీ మూడు నెలల గర్భిణి కావడంతో తల్లిదండ్రుల వద్ద ఉండాలని అంటూ ఆమెను పుట్టింటికి పంపేశాడు. ఈ నెల 1న అత్తగారింటికి వెళ్లి అన్సారీని దూషించడంతో పాటు తీవ్రంగా కొట్టి వెళ్లిపోయాడు. తాను అత్తగారింట్లో పడుతున్న బాధలను తల్లిదండ్రులకు చెప్పుకుని కన్నీరుమున్నీరైంది. తనను కాపాడాలని వారిని వేడుకుంది. భార్యా భర్తలు అన్నాక గొడవలు ఉంటాయని, సర్దుకుపోవాలని నచ్చజెప్పేందుకు యత్నించారు. అయితే.. బుధవారం తెల్లవారుజామున తన గదిలో ప్యాన్‌కు ఉరి వేసుకుని అన్సారీ ఆత్మహత్యకు పాల్పడింది.
వేదింపులు తాళలేక చనిపోతున్నానని, భర్త, అత్తమామలు, తన మృతదేహాన్ని తాకకుండా చూడాలని డైరీలో రాసింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న భర్త సుల్తాన్ కోసం గాలింపు చేపట్టారు.