కొవిడ్ అనుమానం.. ఐదు ఆస్పత్రులు తిరిగినా.. అంబులెన్సులోనే గర్భిణి మృతి
Pregnant woman dies in Ambulance.త్వరలో ఓ బిడ్డను జన్మనివ్వనుంది. దీంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు.
By తోట వంశీ కుమార్ Published on 15 May 2021 8:03 AM ISTత్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. పుట్టబోయే బిడ్డను ఊహించుకుంటూ ఎంతో మురిసిపోయేది. ఆ చిన్నారి కోసం కొద్ది రోజుల క్రితమే చెప్పులు కొని వాటిని అందరికి చూపిస్తూ ఆనందించేది. అయితే.. ఆమె ఆనందాన్ని చూసి కరోనాకు కన్నుకుట్టిందో లేదో తెలీదు కానీ.. గర్భిణీ అని కనికరం చూపలేదు కార్పొరేటు ఆస్పత్రులు. అయిదు ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేక.. దాదాపు ఐదు గంటలు అంబులెన్సులో నరకం అనుభవించింది. చివరికి తల్లితో పాటు లోకం చూడని ఆ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
మల్లాపూర్‌కు చెందిన పావని(22)కి ఏలూరుకు చెందిన తిరుమల్‌రావుతో గతేడాది ఆగస్టులో పెళ్లి జరిగింది. ఇటీవల పురిటి కోసం పుట్టింటికి వచ్చింది. ఎనిమిది నెలలు నిండాయి. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెగ్యులర్‌గా ఆమెకు చెకప్ చేపిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తన సోదరితో కలిసి ఆ ఆస్పత్రికి వెళ్లింది. కడపులో ఉమ్మ నీరు తక్కువగా ఉందని సెలైన్ ఎక్కించి పంపించి వేశారు. కాగా.. శుక్రవారం తెల్లవారుజామున ఆయసం మొదలైంది. వెంటనే ఆమెను అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అయితే.. కరోనా అయి ఉండొచ్చునన్న అనుమానంతో అక్కడకు ఆమెకు చికిత్స చేసేందుకు నిరాకరించారు. ఆమె తల్లి ఎంత వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే పావని ని ఓ అంబులెన్స్‌లో మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అలా ఓ నాలుగు ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఎల్బీనగర్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడి వైద్యులు అడ్మిట్ చేసుకొని.. ఆమె బతకం కష్టమని.. గాంధీకి గాని, కోఠి ప్రసూతి ఆస్పత్రికి గానీ తీసుకెళ్తే.. కనీసం కడుపులో బిడ్డ అయినా బతుకుతుందని పంపించేశారు. కోఠి ప్రసూతి ఆస్పత్రికి తీసుకెలుతుండగా.. పావని కన్నుమూసింది. కోఠి ఆస్పత్రికి చేరుకున్న అనంతరం అంబులెన్సులోనే పరీక్షించిన వైద్యురాలు తల్లీ, బిడ్డా ఇద్దరూ మరణించినట్లు తెలిపారు.