రికవరీ ఏజెంట్ల దాష్టికం.. గర్భిణిని ట్రాక్టర్‌తో తొక్కించి
Pregnant woman crushed under tractor by loan recovery officials in Jharkhand.వాయిదా చెల్లించడం ఆలస్యమైందని ఫైనాన్స్
By తోట వంశీ కుమార్ Published on 17 Sept 2022 11:11 AM ISTవాయిదా చెల్లించడం ఆలస్యమైందని ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లు దారుణానికి ఒడిగట్టారు. దివ్యాంగుడైన రైతు ఇంటికి వెళ్లి గర్భిణిని అయిన అతడి కుమార్తెపై ట్రాక్టర్ ఎక్కించారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లాలో జరిగింది. ఈ ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.
వివరాలు ఇలా ఉన్నాయి. ఇచాక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరియానాథ్ గ్రామంలో మిథిలేష్ మెహతా అనే వికలాంగుడైన రైతు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. కొంతం కాలం క్రితం అతను మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అయితే.. కొన్ని వాయిదాలను సకాలంలో మెహతా చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో గురువారం అతడి ఇంటికి రికవరీ ఏజెంట్లు వచ్చారు. వాయిదాలు చెల్లించకపోవడంతో ట్రాక్టర్ స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో ఇంట్లో రైతుతో పాటు ఆయన కుమార్తె మోనికా మాత్రమే ఉన్నారు. మోనిక ప్రస్తుతం మూడు నెలల గర్భిణీ.
రికవరీ ఏజెంట్లు, మోనికాకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆమెపై దాడి చేసిన ఏజెంట్లు ఆమెను పక్కకు తోసేసి ట్రాకర్ట్‌ను తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకునేందుకు యత్నించిన మోనికా పైకి ట్రాక్టర్‌ను ఎక్కించారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మోనికా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఫైనాన్స్ కంపెనీ స్థానిక మేనేజర్‌తో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. ఈ ఘటనపై మహేంద్ర ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అనీష్ షా విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి కంపెనీ పూర్తిగా అండగా ఉంటుందని, పోలీసుల దర్యాప్తుకు అన్ని విధాల సహకారం అందిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.