Hyderabad Crime : అంబర్ పేట కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. మాజీ భార్యే ప్లాన్ చేసి..
అంబర్‌పేట్ డీడీ కాలనీలో గత నెల 29వ తేదీన జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు
By - Knakam Karthik |
వ్యక్తిని కిడ్నాప్ చేసి రూ.1.5 కోట్లు డిమాండ్.. 10 మంది అరెస్ట్
హైదరాబాద్: అంబర్‌పేట్ డీడీ కాలనీలో గత నెల 29వ తేదీన జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ప్రకారం, ఈ ఘటనలో పాల్గొన్న 10 మంది నిందితులను అంబర్‌పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి శ్యామ్ అనే వ్యక్తిని అపహరించి రూ.1.5 కోట్లు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆరుగురు నిందితులు రెంట్ కార్లను ఉపయోగించి శ్యామ్‌ను కిడ్నాప్ చేసినట్లు విచారణలో తేలింది.
పోలీసుల సమాచారం ప్రకారం, ప్రధాన నిందితురాలు మాధవీలత అమెరికాలో శ్యామ్‌తో వివాహం చేసుకుని మూడేళ్లకే విడిపోయింది. అనంతరం శ్యామ్ తన పేరును ‘అలీ’గా మార్చుకుని ఫాతిమా అనే మహిళను రెండోసారి వివాహం చేసుకున్నాడు. శ్యామ్ తన తండ్రి నుంచి వచ్చిన సుమారు రూ.20 కోట్ల విలువైన ఆస్తిని విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసులో ప్రధాన సూత్రధారి రామనగర్‌కు చెందిన సాయి అని పోలీసులు గుర్తించారు. మరో నిందితురాలు జీ.ప్రీతి లేడీ బౌన్సర్‌గా పనిచేస్తుండగా, ఎల్.సరిత అనే మహిళ బాధితుడు ఉన్న అపార్ట్‌మెంట్‌లోనే ఘటనకు రెండు రోజుల ముందు నివసించి, అతని కదలికలపై నిఘా పెట్టినట్లు విచారణలో బయటపడింది.
బాధితుడిని చెర్లపల్లి ప్రాంతానికి తీసుకెళ్లి రెండు ప్రదేశాల్లో తిప్పుతూ రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆ సమయంలో శ్యామ్ తన స్నేహితుడికి ఫోన్ చేయగా, ఆ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం శ్యామ్ తెలివిగా తప్పించుకుని పోలీసులకు వివరాలు ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. కేసులో మిగిలిన నలుగురిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని డీసీపీ బాలస్వామి తెలిపారు.