ఆరు, ఏడు నెలల నుంచి అన్ని రకాలుగా ప్ర‌య‌త్నించి.. చివ‌రికి డెడ్ బాడీ పార్శిల్ చేసి..

ఆంధ్రప్రదేశ్ పోలీసులు డెడ్ బాడీ పార్శిల్ కేసు మిస్టరీని ఛేదించినట్లు తెలిపారు.

By M.S.R  Published on  28 Dec 2024 8:44 AM IST
ఆరు, ఏడు నెలల నుంచి అన్ని రకాలుగా ప్ర‌య‌త్నించి.. చివ‌రికి డెడ్ బాడీ పార్శిల్ చేసి..

ఆంధ్రప్రదేశ్ పోలీసులు డెడ్ బాడీ పార్శిల్ కేసు మిస్టరీని ఛేదించినట్లు తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రీధర్ వర్మ, పెన్మెత్స సుష్మ, చేకూరి రేవతిలు.. సాగి తులసితో పాటు ఆమె తల్లిదండ్రులు ముదునూరి రంగరాజు (60), ముదునూరి హైమావతి (56)లను బెదిరించి వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

డిసెంబర్ 19న, పశ్చిమగోదావరి జిల్లా యెండగండి గ్రామంలోని ముదునూరి రంగరాజు ఇంటికి 47 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని చెక్క పెట్టెలో పంపించారు. అందులో ఆ కుటుంబాన్ని కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేస్తూ లేఖను పంపారు. మృతుడు గాంధీనగర్‌కు చెందిన బి పార్లయ్యగా పోలీసులు గుర్తించారు. ఈ కుటుంబ వివాదాలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి అతడు.

భీమవరంలో జరిగిన విలేకరుల సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అద్నాన్ నయీమ్ అస్మీ మాట్లాడుతూ, “ఆస్తిలో తన వాటాను వదులుకునేలా తులసిని బెదిరించడానికి, వారు ఆరు నుండి ఏడు నెలల పాటు సాధ్యమైన అన్ని పద్ధతులను అన్వేషించారు. చివరికి ఈ నేరానికి పథకం వేశారు." అని తెలిపారు. వర్మ (37), సుష్మ (37), రేవతి (31)లను పోలీసులు అరెస్టు చేశారు. వర్మ, సుష్మ లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండగా, రేవతి వర్మను వివాహం చేసుకున్నారు.

2012లో భర్త కనిపించకుండా పోవడంతో తులసి యెండగండి గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి జీవించడం ప్రారంభించింది. తులసి, ఆమె తల్లి మధ్య కొంత ఘర్షణ కారణంగా, ఆమె తన మైనర్ కుమార్తెతో విడివిడిగా నివసించడం ప్రారంభించింది. యెండగండిలోని జగనన్న కాలనీలో తన కోసం ఇల్లు నిర్మించుకోవడం ప్రారంభించింది.

సెప్టెంబర్‌లో ఓ అజ్ఞాత వ్యక్తి తులసిని రెండుసార్లు సంప్రదించగా, రాజమండ్రి క్షత్రియ ఫౌండేషన్ నుండి ఆమె ఇంటికి టైల్స్, పెయింట్స్ వంటి నిర్మాణ సామాగ్రిని విరాళంగా పంపిస్తానని తెలిపాడు. అదే వ్యక్తి డిసెంబర్‌లో ఆమెను మళ్లీ సంప్రదించాడు, కొన్ని ఎలక్ట్రికల్ వస్తువులను ఒక పెట్టెలో పంపుతానని చెప్పాడు. అయితే అందులో మృతదేహం ఉన్నట్లు తేలింది. పోలీసుల విచారణలో ఆ అజ్ఞాత వ్యక్తి సుష్మ అని తేలింది.

ముదునూరి రంగరాజు తన కుమార్తెలందరికీ అర ఎకరం వ్యవసాయ భూమిని కేటాయించి 1.4 ఎకరాలు తన కోసం ఉంచుకోగా, వారు నివసిస్తున్న ఇంటిని తన భార్య హైమావతి పేరు మీద రిజిస్టర్‌ చేశారు. ఈ ఆస్తులపై కన్నేసిన వర్మ, రేవతి మృతదేహాన్ని ఉపయోగించి వారిని భయపెట్టేందుకు పథకం రచించారు. ఈ ప్లాన్‌లో భాగంగానే వర్మ, సుష్మలు డిసెంబర్ 17న పార్లయ్య అనే వ్యక్తిని పనిలో పెట్టుకున్నారు. ఆ తర్వాత మద్యం తాగించారని పోలీసులు తెలిపారు. వారు తమ కారులో పర్లయ్యను వేంద్రం గ్రామానికి తీసుకెళ్లి హత్య చేసి, ఆపై మృతదేహాన్ని చెక్క పెట్టెలో పెట్టి ఆటో రిక్షాలో రాజు ఇంటికి పంపించారు. విరాళంగా వచ్చిన ఎలక్ట్రికల్ వస్తువుల పెట్టె అని తులసి నమ్మింది.

రాజు, తులసి, హైమావతిని మరింత భయపెట్టడానికి, రూ. 1.3 కోట్లు డిమాండ్ చేస్తూ.. ఓ లేఖ రాసి పెట్టెకి అతికించారు. అయితే బాక్స్ కు సంబంధించి రేవతితో వర్మ నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాడు. ఆ పెట్టె రాజు ఇంటికి చేరుకోగానే అందులో ఎలక్ట్రికల్ సామాన్లు లేవని, డబ్బు డిమాండ్ చేస్తూ లేఖతో పాటు మృతదేహం ఉందని గ్రహించారు.

ఇంతలో వర్మ తన మామగారికి, అత్తగారికి డబ్బు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు, అయితే ఆ డబ్బును అతనికి తిరిగి చెల్లించడానికి తమ పొలాలు అమ్మవలసి ఉంటుంది. తులసి దీన్ని తిరస్కరించింది. పోలీసులకు సమాచారం అందించింది. పోలీసుల ఎంట్రీతో వర్మ పారిపోయాడు. దీంతో అతని భార్య రేవతి, ప్రియురాలు సుష్మతో పాటు అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు BNS సెక్షన్లు 103 మరియు 61(2) రీడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసును ఛేదించేందుకు మొత్తం 11 పోలీసు బృందాలు వారం రోజులకు పైగా శ్రమించాయి.

Next Story