విశాఖ : ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్య
విశాఖపట్నంలో ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్యకు పాల్పడింది.
By తోట వంశీ కుమార్ Published on 28 Feb 2023 1:38 PM ISTవిశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 29 ఏళ్ల మువ్వల అలేఖ్య తన భర్త నరేష్, ఇద్దరు పిల్లలతో కలిసి ఎంవీపీకాలనీలో నివాసం ఉండేవారు. అయితే..గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు సంవత్సరాల క్రితం భర్తను వదిలి తన ఇద్దరు పిల్లలను తీసుకుని అలేఖ్య ఆరిలోవ ప్రాంతం మమూరినగర్‌కు వచ్చింది. ఇక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అందులోనే ప్లే స్కూల్ నడుపుతూ జీవనం సాగిస్తోంది.
కుమారుడిని విజయవాడలోని హాస్టల్ లో ఉంచి చదివిస్తోంది. తొమ్మిదేళ్ల కూతురితో కలిసి ఉంటోంది. అయితే.. ఏం జరిగిందో తెలీదు గానీ ఆదివారం అర్థరాత్రి సమయంలో ఆమె గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్ది సేపటి తరువాత తల్లి ఫ్యాన్‌కు వేలాడుతున్న దృశ్యాన్ని చూసిన ఆమె కూతురు ఫోన్‌లో ఉన్న నెంబర్లకు ఫోన్ చేసింది.
అలేఖ్య బంధువులు, ఆమె తల్లి వెంటనే అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.