కాళేశ్వరం కుంగుబాటుపై ఫిర్యాదు చేసిన వ్యక్తి దారుణ హత్య

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై ఫిర్యాదు చేసిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

By Knakam Karthik
Published on : 20 Feb 2025 7:36 AM IST

Crime News, Telangana, Jayashankar Bhupalapally, Murder, Kaleshwaram Project

కాళేశ్వరం కుంగుబాటుపై ఫిర్యాదు చేసిన వ్యక్తి దారుణ హత్య

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై ఫిర్యాదు చేసిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తిని బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీ వద్ద గల టీబీజీకేఎస్ ఆఫీసు ఎదురు గల్లీలో నాగవెల్లి రాజలింగమూర్తిని హత్య చేశారు. తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బుధవారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై కేసీఆర్, మాజీ మంత్రులతో పాటు సదరు, గుత్తేదారు కంపెనీలపై ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి హత్య పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దాడిలో తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న భూపాలపల్లి పోలీసులు మృతదేహాన్ని మార్చురీ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.

ఈయనపై గతంలో భూతగాదాల విషయమై పలు కేసులు నమోదయ్యాయి. హత్యకు పూర్తి వివరాలు తెలియరాలేదు. ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేని పోలీసులు తెలిపారు. రాజలింగమూర్తి వార్డు మాజీ కౌన్సిలర్ నాగవెళ్లి సరళ భర్త. ఆమె 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి లోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్‌గా గెలుపొందారు. కొద్ది నెలల తర్వాత నాగవెళ్లి సరళను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించారు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం రాజలింగమూర్తి తన స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి తిరిగి వస్తుండగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతున్న క్రమంలో నలుగురు నుంచి ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి ఆయన్ను చుట్టుముట్టారు. ఒక్కసారిగా కత్తులు, గొడ్డళ్లతో నరికారు. తలకు బలమైన గాయంతోపాటు కత్తిపోట్ల కారణంగా పేగులు బయటకు వచ్చాయి. స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Next Story