రూ. 60 వేల కోట్ల స్కామ్‌.. జైలులో ఉన్న పెరల్ గ్రూప్ చైర్మన్.. కన్వల్జీత్ సింగ్ టూర్‌ మృతి

Pearl Group chairman Kanwaljeet Singh lodged in Delhi jail, passes away. రూ. 60,000 కోట్ల పెరల్ గ్రూప్ కుంభకోణం కేసులో.. ప్రస్తుతం దేశ రాజధానిలోని రోహిణి జైలులో ఉన్న నిందితుల్లో ఒకరైన కన్వల్జీత్ సింగ్ టూర్

By అంజి  Published on  4 Jan 2022 8:12 AM GMT
రూ. 60 వేల కోట్ల స్కామ్‌.. జైలులో ఉన్న పెరల్ గ్రూప్ చైర్మన్..  కన్వల్జీత్ సింగ్ టూర్‌ మృతి

రూ. 60,000 కోట్ల పెరల్ గ్రూప్ కుంభకోణం కేసులో.. ప్రస్తుతం దేశ రాజధానిలోని రోహిణి జైలులో ఉన్న నిందితుల్లో ఒకరైన కన్వల్జీత్ సింగ్ టూర్ మరణించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. కన్వల్జీత్‌ సింగ్‌ టూర్‌ మరణాన్ని ధృవీకరిస్తూ డైరెక్టర్ జనరల్ (జైళ్లు) సందీప్ గోయల్ మాట్లాడారు. 62 ఏళ్ల అండర్ ట్రయల్ ఖైదీ టూర్‌ను తక్కువ రక్తపోటు కారణంగా జనవరి 1న నగరంలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ఆదివారం, జనవరి 2న టూర్ ఆసుపత్రిలో కన్నుమూశారు" అని గోయల్ చెప్పారు.

పెరల్ గ్రూప్ కుంభకోణం కేసులో టూర్ సహా 11 మందిని అరెస్టు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) డిసెంబర్ 23న తెలిపింది. "చందర్ భూషణ్ ధిల్లాన్, ప్రేమ్ సేథ్, మన్మోహన్ కమల్ మహాజన్, మోహన్ లాల్ సెహజ్‌పాల్, కన్వల్‌జిత్ సింగ్ టూర్ అరెస్టయిన పెరల్స్ గ్రూప్ ఉద్యోగులు. వీరితో పాటు ఢిల్లీ, చండీగఢ్, కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్తలు ప్రవీణ్ కుమార్ అగర్వాల్, మన్నోజ్ కుమార్ జైన్, ఆకాష్ అగర్వాల్, అనిల్ కుమార్ ఖేమ్కా, సుభాష్ అగర్వాల్, రాజేష్‌లను అరెస్టు చేశాం'' అని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.

చట్టబద్ధమైన ఆమోదం లేకుండా, వివిధ పెట్టుబడి పథకాలను అక్రమంగా నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మంది పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ.60,000 కోట్లు వసూలు చేసిన పెరల్స్ గ్రూప్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాము గతంలో ప్రాథమిక విచారణను నమోదు చేశామని ఆయన చెప్పారు. నిందితులు పెట్టుబడిదారులను ఎరగా వేసేందుకు భూమిని హామీగా ఇచ్చారు. పెట్టుబడి పెడితే 12.5 శాతం వడ్డీ వస్తుందని ప్రజలకు చెప్పారు. వారికి వారి పెట్టుబడులపై ఉచిత ప్రమాద బీమా, ఆదాయపు పన్ను రహిత మెచ్యూరిటీని అందించారు. తాము కొనుగోలు చేస్తున్న భూమి విలువ వేగంగా పెరుగుతుందని నిందితులు పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు.

Next Story
Share it