షాకింగ్‌.. అమీన్‌పూర్‌లో పరువు హత్య

హైదరాబాద్ శివారు అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన పరువు హత్య జ‌రిగింది.

By -  Medi Samrat
Published on : 10 Dec 2025 8:42 PM IST

షాకింగ్‌.. అమీన్‌పూర్‌లో పరువు హత్య

హైదరాబాద్ శివారు అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన పరువు హత్య జ‌రిగింది. ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడిని ఇంటికి పిలిపించి బ్యాట్లతో కొట్టి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. బీరంగూడ ప్రాంతానికి చెందిన సాయి (20) అనే యువ‌కుడు.. అదే ప్రాంతానికి చెందిన యువతి(19) గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలియ‌డంతో యువతి తల్లిదండ్రులు పెళ్లి విషయమై మాట్లాడతామని సాయిని ఇంటికి రావాలని పిలిచారు. పెళ్లికి అంగీకారం తెలుపుతారేమోన‌నే నమ్మకంతో సాయి యువ‌తి ఇంటికి వెళ్లాడు.

అయితే సాయి ఇంటికి వెళ్లిన వెంటనే యువ‌తి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కలిసి సాయిపై బ్యాట్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సాయి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న సాయిని ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. అక్క‌డ అత‌డు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రేమిస్తున్నాడన్న కారణంతోనే సాయిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప‌రారీలో ఉన్న యువ‌తి తల్లిదండ్రులు సహా కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story