ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవడంతో అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాలో ఇటీవల ముగిసిన మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో సుమతి పరిదా ఓడిపోయారు. కాగా భర్త మరణవార్త తెలియగానే సుమతి విషం తాగి తన జీవితాన్ని అంతమొందించేందుకు ప్రయత్నించింది. గెలిచిన అభ్యర్థి మద్దతుదారులు ఆ కుటుంబాన్ని వేధించారు.
వివరాల్లోకి వెళ్తే.. సుమతి భద్రక్ జిల్లా బాసుదేవ్‌పూర్ బ్లాక్‌లోని పద్మాపూర్ పంచాయతీ ఎన్నికలకు స్వతంత్ర అభ్యర్థిగా పంచాయతీ సమితి సభ్యుని పదవికి పోటీ చేశారు. ఆదివారం సాయంత్రం గెలిచిన అభ్యర్థులతో విజయయాత్ర సాగింది. కుటుంబ సభ్యులు వేధింపులకు, అవహేళనలకు గురైన సుమతి పరిదా నివాసం వైపు విజయయాత్ర సాగిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఆ తర్వాత భర్త రమాకాంత ఎన్నికల ప్రచారానికి డబ్బు వృధా చేశారంటూ సుమతితో వాగ్వాదానికి దిగాడు. వాగ్వాదం జరిగిన కొద్దిసేపటికే రమాకాంత తన ఇంట్లో ఉరివేసుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
భర్త మృతి చెందడంతో మనస్తాపానికి గురైన సుమతి సోమవారం విషం తాగింది. గ్రామస్తులు వెంటనే ఆమెను భద్రక్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమెను కటక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భద్రక్ పోలీస్ ఎస్పీ చరణ్ సింగ్ మీనా తెలిపారు.