హైవే కిల్లర్ మున్నా కేసులో 12 మందికి ఉరిశిక్ష.. ముగ్గురికి రెండుసార్లు..

Ongole Highway Killer Munna Case.హైవే కిల్లర్‌ మున్నా గ్యాంగ్‌ కేసులో ఒంగోలు జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

By Medi Samrat  Published on  24 May 2021 11:49 AM GMT
Highway Killer Munna

హైవే కిల్లర్‌ మున్నా గ్యాంగ్‌ కేసులో ఒంగోలు జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు మున్నాతో పాటు 11 మందికి ఉరిశిక్ష విధించింది. 13 ఏళ్ల కిందట హైవేపై లారీ డ్రైవర్లు, క్లీనర్లను మున్నా గ్యాంగ్‌ హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. 13 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో నిందితుడు లారీ డ్రైవర్‌, క్లీనర్‌లను దారుణంగా హత్య చేశారని తేలడంతో ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 11 మందికి న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. వీరిలో ముగ్గురిని రెండుసార్లు ఉరి తీయాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.

2008లో లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా హతమార్చి వాగు వద్ద హైవే కిల్లర్‌ మున్నా గ్యాంగ్‌ పూడ్చి పెట్టిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. 4 కేసుల్లో 18 మందిపై నేరం రుజువైంది. పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌ నుంచి ఇనుప రాడ్ల లోడ్‌తో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్‌ అదృశ్యమయ్యారు. దీంతో 2008 అక్టోబర్‌ 17న లారీ యజమాని వీరప్పన్‌ కుప్పుస్వామి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పాత ఇనుము వ్యాపారులపై ప్రత్యేక నిఘా పెట్టారు. సయ్యద్‌ అబ్దుల్‌ సమద్‌ అలియాస్‌ మున్నా కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 20కి పైగా సిమ్‌ కార్డులు మార్చి దేశం వదిలి పారిపోయేందుకు ప్రయత్నించిన మున్నాను కర్ణాటకలోని అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు నిందితులకు ఉరి శిక్ష విధిస్తు ఒంగోలు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం ఒంగోలులోని 8వ అదనపు సెషన్స్ కోర్టు మున్నా, అతడి గ్యాంగ్ కు ఉరిశిక్షలు విధించింది. ఇందులో ప్రధాన ముద్దాయి మున్నా, అతడికి సహకరించిన 11 మందికి ఉరిశిక్ష విధించింది. మరో ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. ఐరన్ లోడుతో వెళ్లే లారీలను టార్గెట్ చేసి డ్రైవర్, క్లీనర్లను చంపి.. ఐరన్ లోడుతో పరారయ్యే వాళ్లు. ఐరన్ లోడు అమ్మేశాక, లారీలను తుక్కు కింద విడగొట్టి ఆ భాగాలను కూడా విక్రయించేవారు. హైవేపై వాహనాలు తనిఖీ చేస్తున్నట్టుగా లారీలను ఆపేవారు. మున్నా అధికారి వేషంలో ఉండగా, అతడి పక్కన ఓ వ్యక్తి గన్ మన్ గా మెషీన్ గన్ చేతబట్టి ఉండడంతో వారు నిజంగానే అధికారులని భావించి లారీ డ్రైవర్లు తమ వాహనాలు ఆపేవారు. చెక్ చేయాలనే నెపంతో లారీ డ్రైవర్లు, క్లీనర్ల గొంతుకలకు తాడు బిగించి దారుణంగా హత్య చేసేవారు. తాము చంపిన డ్రైవర్లు, క్లీనర్ల శవాలను గోతాల్లో కుక్కి హైవే పక్కనే వాగుల్లో పూడ్చిపెట్టేవారు. దోపిడీ చేసిన ఐరన్ లోడును గుంటూరులో అమ్మేవారు.


Next Story
Share it