Telangana : గురుకుల పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి మృతి

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాలలో కడుపునొప్పితో ఓ ఆరో తరగతి విద్యార్థి మృతి చెందగా..

By Medi Samrat
Published on : 9 Aug 2024 8:00 PM IST

Telangana : గురుకుల పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి మృతి

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాలలో కడుపునొప్పితో ఓ ఆరో తరగతి విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రి పాలయ్యారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఉమా మహేశ్వర రావు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు విద్యార్థులు ఆరో తరగతి చదువుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన అనిరుధ్ అనే విద్యార్థి తెల్లవారుజామున 3 గంటల సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే బాలుడిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని కేర్‌టేకర్ నిర్ణయించినప్పటికీ, అతను మార్గమధ్యంలో మరణించాడు.

ఆ తర్వాత ఉదయం 7 గంటల సమయంలో మోక్షిత్, హేమంత్ యాదవ్ అనే మరో ఇద్దరు విద్యార్థులు కడుపునొప్పి ఉందంటూ ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పాఠశాల అధికారులు వారిని నిజామాబాద్‌, మెట్‌పల్లి ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. పోలీసులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, సిబ్బందిని విచారించారు. విద్యార్థి మృతికి, అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story