అరోరా ఫార్మా కంపెనీలో పేలుడు.. కూలీ మృతి
జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని అరోరా ఫార్మా కంపెనీ రియాక్టర్‌లో బుధవారం రసాయనిక పేలుడు సంభవించింది.
By Medi Samrat Published on 20 Nov 2024 6:58 PM ISTజీడిమెట్ల పారిశ్రామిక వాడలోని అరోరా ఫార్మా కంపెనీ రియాక్టర్‌లో బుధవారం రసాయనిక పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అనిల్ అనే 40 ఏళ్ల కూలీ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గోపి (23 సంవత్సరాలు), శ్రీనివాస్ (25), బలరాం (30) లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫార్మా కంపెనీలో బాయిలర్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో వీరంతా గాయపడ్డారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున ప్రమాదం జరిగినా యాజమాన్యం వెంటనే తమకు సమాచారం అందించలేదని మృతుడి బంధువులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రమాదం జరిగిన తర్వాత కంపెనీ ప్రతినిధులు తమకు ఫోన్ చేయలేదని, మీడియా ప్రతినిధి ఇచ్చిన సమాచారంతోనే తాము వచ్చామని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. గాయపడ్డవారిని గుట్టు చప్పుడు కాకుండా కంపెనీ యాజమాన్యం యశోద ఆసుపత్రికి తరలించిందని తెలుస్తోంది. స్థానికులు, కార్మికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.