ముంబై లోని అటల్ సేతుపై కారు ఆపి బ్రిడ్జి రెయిలింగ్ పైకి ఎక్కిన 38 ఏళ్ల వ్యక్తి దానిపై నుంచి దూకేశాడు. బ్రిడ్జిలోని CCTV ఫుటేజీలో, ఇంజనీర్, డోంబివిలి నివాసి అయిన కె.శ్రీనివాస్ తన కారును అటల్ సేతుపై ఆపి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్ తీవ్రమైన ఆర్థిక సమస్యలతో పోరాడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ 2023లో కువైట్‌లో పనిచేస్తున్నప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఫ్లోర్ క్లీనర్‌ను తాగేసినా ప్రాణాలతో బయటపడ్డాడు.
ఆత్మహత్య చేసుకోడానికి ముందు శ్రీనివాస్ తన ఇంటి నుండి అంతకు ముందు రోజు రాత్రి సుమారు 11:30 గంటలకు బయటకు వచ్చాడు. ఇక వంతెనపైకి వెళ్లే ముందు, అతను తన భార్య, నాలుగేళ్ల కుమార్తెకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నవీ ముంబై పోలీసులు, అటల్ సేతు రెస్క్యూ టీమ్‌లు, తీరప్రాంత పోలీసులు, స్థానిక మత్స్యకారులతో కలిసి వెంటనే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి.