ప్రియురాలు పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని.. ప్రియుడు ఏకంగా..
ఒడిశాలోని భద్రక్ జిల్లాలో తన పెళ్లి ప్రతిపాదనను నిరాకరించినందుకు ఓ యువకుడు తన ప్రియురాలు ఇంటికి నిప్పంటించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
By అంజి Published on 19 Dec 2024 3:54 AM GMTప్రియురాలు పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని.. ప్రియుడు ఏకంగా..
ఒడిశాలోని భద్రక్ జిల్లాలో తన పెళ్లి ప్రతిపాదనను నిరాకరించినందుకు ఓ యువకుడు తన ప్రియురాలు ఇంటికి నిప్పంటించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటన జిల్లాలోని ధామ్‌నగర్ పరిధిలోని ఆనంద్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. చుడాకుటి పంచాయతీ పరిధిలోని విద్యాధర్‌పూర్ గ్రామానికి చెందిన జ్యోతి రంజన్ దాస్ (28) అనే నిందితుడు ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
ఆనంద్‌పూర్ పంచాయతీ పరిధిలోని గోపాల్ సాహికి చెందిన ఓ మహిళతో జ్యోతి రంజన్ దాస్‌కి సంబంధం ఉంది. తనను పెళ్లి చేసుకోవాలని అతను పట్టుదలతో ఒత్తిడి చేస్తున్నాడని, ఆమె అంగీకరించకపోతే వారి వ్యక్తిగత క్షణాల చిత్రాలను లీక్ చేస్తానని బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. జ్యోతి రంజన్ దాస్ చంపేస్తానని బెదిరింపులకు గురి చేశాడని, తనను కలవమని బలవంతం చేసేందుకు ప్రయత్నించాడని ఆ మహిళ ధమ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జ్యోతి రంజన్ దాస్ తన ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. "అగ్ని ప్రమాదంలో ఐదు షెడ్లు ధ్వంసమయ్యాయి. బంగారు ఆభరణాలు, ఫర్నిచర్, బియ్యం, ముఖ్యమైన పత్రాలతో సహా అన్ని విలువైన వస్తువులు బూడిదయ్యాయి" అని ఆమె పేర్కొంది. అగ్నిప్రమాదంలో రూ.15 లక్షల విలువైన సొత్తు దగ్ధమైనట్లు ఆమె తెలిపారు. ఫిర్యాదు మేరకు ధామ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, నిందితుడు ఆ ప్రాంతం నుండి పారిపోయాడు. అతన్ని తక్షణమే అరెస్టు చేయాలని మహిళ, ఆమె కుటుంబ సభ్యులు కోరారు.
"నిందితుడు మా భద్రతకు ముప్పు అని, వెంటనే పట్టుకోకపోతే, అతను మరిన్ని హేయమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉంది" అని బాధితురాలు విలేకరులతో అన్నారు.