ఆస్ప‌త్రిలోకి చొర‌బ‌డి.. న‌ర్సుపై సామూహిక అత్యాచారం

Nurse molested At Chhattisgarh Health Centre.ఆస్ప‌త్రిలో న‌ర్సు ఒంట‌రిగా ఉండ‌టాన్ని గ‌మ‌నించిన న‌లుగురు వ్య‌క్తులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Oct 2022 2:08 PM IST
ఆస్ప‌త్రిలోకి చొర‌బ‌డి.. న‌ర్సుపై సామూహిక అత్యాచారం

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై దాడులు ఆగ‌డం లేదు. ఏ మాత్రం భ‌యం లేకుండా మాన‌వ‌మృగాలు మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. ఆస్ప‌త్రిలో న‌ర్సు ఒంట‌రిగా ఉండ‌టాన్ని గ‌మ‌నించిన న‌లుగురు వ్య‌క్తులు ఆమెను తాడుతో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. రెండు గంట‌ల పాటు న‌ర‌కం చూపించారు. ఈ దారుణ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌డ్ రాష్ట్రంలో జ‌రిగింది.

దీపావ‌ళి సంద‌ర్భంగా మ‌హేంద్ర‌గ‌ఢ్ జిల్లాలోని చిప్పచ్చిపై గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది సెల‌వుల‌పై వెళ్లారు. ఓ న‌ర్సు మాత్ర‌మే విధులు నిర్వ‌ర్తిస్తోంది. ఆమె ఒంట‌రిగా ఉండ‌టాన్ని గ‌మ‌నించిన న‌లుగురు యువ‌కులు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో ఆస్ప‌త్రికి వ‌చ్చారు. హ‌స్పిట‌ల్‌లోనే న‌ర్సును క‌ట్టేసి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. దాదాపు రెండు గంట‌ల పాటు న‌రకాన్ని చూపించారు.

ఈ దారుణాన్ని వీడియో తీశారు. విష‌యాన్ని ఎవ‌రికైనా చెబితే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. అనంత‌రం క‌ట్లు విప్పి వెళ్లిపోయారు. బాధితురాలు ఇంటికి చేరుకుని విష‌యాన్ని త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. వారి సాయంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 17 ఏళ్ల మైన‌ర్ స‌హా ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. మ‌రొ నిందితుడు ప‌రారీలో ఉన్నాడ‌ని, అత‌డి కోసం గాలిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా బీజేపీ నాయ‌కులు నిర‌స‌న‌లు చేప‌ట్టారు. మారుమూల ప్రాంతంలో పనిచేసే ఆరోగ్య సిబ్బందికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అంతవరకు విధులకు హాజరుకామని జిల్లా ఆరోగ్య కేంద్రంలోని చీఫ్ హెల్త్ ఆఫీసర్ ప్రతిమా సింగ్ అన్నారు.

Next Story