విశాఖపట్నంలోని మధురవాడలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మధురవాడలోని ఆదిత్య ఫార్చున్ టవర్‌లోని ఫ్లాట్ నెంబర్ 505లో అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు పొగ వెలువడడంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులకు సమాచారం అందించారు. అయితే.. వారు అక్కడకు చేరుకునే లోపే ఇంట్లోని నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు.
మృతులను బంగారునాయుడు (50), డాక్టర్ నిర్మల (44), దీపక్ (22), కశ్యప్ (19)గా పోలీసులు గుర్తించారు. విజయనగరం జిల్లా గుంట్యాడకు చెందిన బంగారు నాయుడు కుటుంబం బెహరాన్‌లో స్థిరపడింది. నాలుగేళ్ల క్రితం విశాఖ జిల్లాకు వచ్చారు. 8 నెలల క్రితమే ఆదిత్య టవర్స్‌లోని ప్లాట్‌లో అద్దెకు దిగారు. ఇంట్లోని ఏసీ, సామాగ్రి పూర్తిగా దగ్థమై ఉన్నాయి. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉన్నాయి. ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది. వీరిని ఎవరైనా హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారా..? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అపార్ట్‌మెంట్ చట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.