బ్యాంకు ఉద్యోగిని కాల్చి చంపారు.. కారును ఆపి మరీ.. సినిమా స్టైల్లో..
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో 29 ఏళ్ల బ్యాంకు ఉద్యోగిని పట్టపగలు కాల్చి చంపారు. ఈ హత్యకు అతని భార్య, అత్తమామలు కారణమని అతని కుటుంబం ఆరోపించింది.
By అంజి
బ్యాంకు ఉద్యోగిని కాల్చి చంపారు.. కారును ఆపి మరీ.. సినిమా స్టైల్లో..
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో 29 ఏళ్ల బ్యాంకు ఉద్యోగిని పట్టపగలు కాల్చి చంపారు. ఈ హత్యకు అతని భార్య, అత్తమామలు కారణమని అతని కుటుంబం ఆరోపించింది. బాధితుడు ఘజియాబాద్‌లో నివసిస్తున్న బ్యాంక్ డేటా మేనేజర్ మంజీత్ మిశ్రా శుక్రవారం ఉదయం గ్రేటర్ నోయిడాలో పనికి వెళుతుండగా తుపాకీ దాడికి గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో అతని కారును అడ్డగించి, తలపై కాల్చి చంపి పారిపోయారు. ఈ మొత్తం సంఘటన కారు డ్యాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డైంది.
మంజీత్ మిశ్రా కుటుంబం.. అతని భార్య మేఘా రాథోడ్, ఆమె బంధువులు అతని కులాంతర వివాహంపై ఉద్రిక్తతలను చూపుతూ ఈ హత్యకు కుట్ర పన్నారని ఆరోపించింది. బ్రాహ్మణుడైన మిశ్రా, ఒక సంవత్సరం క్రితం తన కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా ఠాకూర్ అయిన మేఘాను వివాహం చేసుకున్నాడు. అతని సోదరి రూపం మాట్లాడుతూ.. అతని అత్తమామలు "తక్కువ కులానికి" చెందిన వ్యక్తి అని ఆగ్రహం వ్యక్తం చేశారని, పదే పదే తనను బెదిరించారని పేర్కొంది.
దాడుల తరువాత, రక్తంతో తడిసిన మిశ్రా మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. తన అత్తమామల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ అతను గతంలో ఘజియాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని అతని కుటుంబం వెల్లడించింది. మేఘా కుటుంబం తమను పలుమార్లు వేధించిందని, వెంటాడటం, బెదిరింపులకు పాల్పడిందని రూపమ్ ఆరోపించారు.
పోలీసులు మిశ్రా భార్య, బావమరిదిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఉంది. మరిన్ని ఆధారాల కోసం అధికారులు డాష్‌బోర్డ్ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు.