రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వివాహ వేడుకకు వెలుతుండగా కారు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు సహా 9 మంది దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. శనివారం సాయంత్రం చౌత్ కా బర్వాడ నుంచి ఉజ్జయినికి ఓ పెళ్లి బృందం కారులో బయలుదేరింది. కోటాలోని చోటి పులియా ప్రాంతానికి చేరుకునే సరికి చీకటి పడింది. ఆ సమయంలో చంబల్ నది దాటుతుండగా.. కారు డ్రైవర్‌కు రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో రోడ్డుపై నుంచి చంబల్ నదిలోకి కారు దూసుకెళ్లింది.
దీంతో కారులో ఉన్నవారు జలసమాధి అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం 9 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ఎవ్వరూ గమనించలేదు. ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో నదిలో పడిన కారును వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.