ప్రభుత్వ పాఠశాల టాయిలెట్‌లో పసికందు మృతదేహం లభ్యం

Newborn found dead inside toilet of govt school in Tamilnadu. అప్పుడే పుట్టిన పసికందు.. సర్కార్‌ బడి టాయిలెట్‌లో శవమై కనిపించింది. తమిళనాడులోని తిరుచ్చిలో

By అంజి  Published on  8 Dec 2022 2:45 PM GMT
ప్రభుత్వ పాఠశాల టాయిలెట్‌లో పసికందు మృతదేహం లభ్యం

అప్పుడే పుట్టిన పసికందు.. సర్కార్‌ బడి టాయిలెట్‌లో శవమై కనిపించింది. తమిళనాడులోని తిరుచ్చిలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది. శిశువును ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ వైద్యులు పసికందు అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరువెరుంబూర్ సమీపంలోని తిరుచ్చిలోని కట్టూర్ ప్రాంతంలోని పాఠశాలలోని టాయిలెట్‌లో శిశువు శవమై కనిపించింది.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పోలీసులకు సమాచారం అందించింది. ఆమె పోలీసు ఫిర్యాదులో.. "పాఠశాల శానిటరీ వర్కర్ శాంత టాయిలెట్‌లోకి ప్రవేశించినప్పుడు, రక్తపు గాయాలతో అక్కడ నవజాత శిశువు కనిపించింది." అని చెప్పారు. శిశువును తిరుచ్చిలోని ఆస్పత్రికి పంపారు. అయితే వైద్యుడు.. ఆ శిశువు చనిపోయినట్లు ప్రకటించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి 174 క్రిమినల్ ప్రొసీజర్ (CrPC) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పాఠశాల ఆవరణలోని మరుగుదొడ్డిలో చిన్నారి పుట్టిందా లేక అప్పుడే పుట్టిన బిడ్డను ఎవరైనా పాఠశాల మరుగుదొడ్డిలోకి విసిరేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తదితర కోణాల్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఘటనా స్థలం నుంచి ఆధారాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రప్పించారు. సమాచారం అందుకున్న ఆది ద్రావిడర్ సంక్షేమ శాఖ, తహసీల్దార్ చంద్ర దేవనాథన్, పాఠశాల విద్యాశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రస్తుతం పాఠశాలలో సరిపడా సెక్యూరిటీ గార్డులను నియమించాలని, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story