భయంకరమైన ఘటన.. టాయిలెట్ ప్లష్‌లో నవజాత శిశువు మృతదేహం
కర్ణాటకలోని రామనగర జిల్లా హరోహళ్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది.
By Medi Samrat Published on 28 Nov 2024 5:46 PM ISTకర్ణాటకలోని రామనగర జిల్లా హరోహళ్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన పసికందును ఆసుపత్రి టాయిలెట్‌లో ఫ్లష్ చేశారు. ఆస్పత్రి కింది అంతస్తులో ఉన్న టాయిలెట్‌లో పాప మృతదేహం లభ్యమైంది. మరుగుదొడ్డిలో అడ్డంకులు ఏర్పడిన విషయాన్ని గమనించిన పారిశుద్ధ్య కార్మికులు.. సరిచేయాలని ప్లంబర్‌ను కోరారు. లైన్ ఫిక్స్ చేస్తున్నప్పుడు ముందుగా ఏదో గుడ్డ ఇరుక్కుపోయిందని భావించినా.. ఆ తర్వాత శిశువు మృతదేహం ఇరుక్కుపోయిందని గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కడ ఉన్న క్లీనింగ్ వర్కర్లు, ప్లంబర్లు, ఇతర వ్యక్తులు నవజాత శిశువు మృతదేహాన్ని చూసి షాకయ్యారు. మరుగుదొడ్లలో అడ్డుపడే పదార్థాలను తొలగించేందుకు ఉపయోగించే పరికరాల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయింది.
బిడ్డ పుట్టిన విషయాన్ని దాచేందుకు నిందితులు ప్రయత్నించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుల కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాల కోసం పోలీసులు ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
నవజాత శిశువుపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. ఈ నేరంలో తల్లి ప్రమేయం ఉందా..? లేదా బిడ్డను వేరే ప్రాంతం నుండి ఇక్కడకు తీసుకువచ్చారా అని అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు, సీసీటీవీ ఫుటేజీ, ఇతర వివరాల కోసం ఎదురుచూస్తున్నారు.