స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడొద్దన్నందుకు.. నవ వధువు ఆత్మహత్య
New Bride commits suicide in Hyderabad.స్మార్ట్‌ఫోన్‌కు బానిసలు అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 9 Dec 2022 8:08 AM ISTకరోనా లాక్‌డౌన్ సమయం నుంచి స్మార్ట్‌ఫోన్‌కు బానిసలు అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఫోనే ప్రపంచంగా బ్రతుకుతున్నారు. పక్కన ఏం జరిగినా పట్టించుకోవడం లేదు. స్మార్ట్‌ఫోన్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఓ నవ వధువు తన ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్లలో జరిగింది.
పులివెందులకు చెందిన గంగాప్రసాద్‌రెడ్డికి విజయవాడకు చెందిన శైలు(20)తో అక్టోబర్ 16న వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులుకు కొత్త జంట హైదరాబాద్ చింతల్‌లోని శ్రీసాయికాలనీలో ఓ అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. శైలు ఇంటి వద్దే ఉంటుండగా, గంగాప్రసాద్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.
కరోనా లాక్‌డౌన్ సమయంలో శైలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారింది. రోజులో చాలా సమయం ఫోన్‌ను వాడుతూనే ఉండేది. తల్లిదండ్రులు వారించినా పట్టించుకోలేదు. పెళ్లి చేసుకుంటానని శైలు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు సంతోషించారు. ఇలాగైన తమ కుమార్తెలో మార్పు వస్తుందని బావించారు. అయితే.. వివాహం తరువాత కూడా శైలు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌తోనే గడిపేది. రీల్స్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుండడంతో ఫోన్‌కు దూరంగా ఉండాలని భర్త పలుమార్లు నచ్చజెప్పాడు. అయినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు.
వారం క్రితం స్మార్ట్ ఫోన్ కు భర్త కొత్త పాస్‌వర్డ్ సెట్ చేశాడు. బుధవారం రాత్రి ఫోన్ లాక్ తీసేయాలని భర్తను కోరింది. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఆందోళన చెందిన భర్త కుటుంబీలకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. శైలు తల్లిదండ్రులు ఫోన్‌లోనే ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆమె తల్లి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు సిద్ధం అవ్వగా.. గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.