సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య కేసులో కొత్త కోణం
New Angle in Software engineer murder case.సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నారాయణరెడ్డి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి
By తోట వంశీ కుమార్ Published on 5 July 2022 11:52 AM ISTసాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నారాయణరెడ్డి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సుపారీ గ్యాంగ్ నారాయణరెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన కూతురిని ప్రేమ వివాహం చేసుకున్న నారాయణరెడ్డి హత్యకు మామ కందుల వెంకటేశ్వర్ రెడ్డి రూ.4.50 లక్షల సుపారీ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ప్రేమ వివాహం చేసుకుని ఢిల్లీలో తలదాచుకున్న కుమారై, అల్లుడికి ఘనంగా పెళ్లి చేస్తానని నచ్చజెప్పి కుమారైను ఇంటికి తీసుకువచ్చి గృహ నిర్భందం చేశారు. వేరే పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి చేయడంతో అందుకు ఆమె నిరాకరించింది. దీన్ని వెంకటేశ్వర్ రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు.దీనికి కారణమైన అల్లుడు నారాయణరెడ్డిని హత్య చేయాలని బావించాడు. బంధువైన శ్రీనివాస్ రెడ్డిని ఆశ్రయించగా.. రూ.4.50 లక్షలకు ఒప్పందం కుదిరింది.
శ్రీనివాస్ రెడ్డి, ఆశిక్, కాశీలు జూన్ 27న కేపీహెచ్‌బీ రూమ్ నుంచి నారాయణరెడ్డిని కారులో ఎక్కించుకొని మద్యంలో మత్తు మందు కలిపి టవల్‌తో మెడకు ఉచ్చుగా వేసి హతమార్చారు. అనంతరం అదే కారులో జిన్నారం శివారు రహదారి పక్కన అటవీ ప్రాంతంలోకి మృతదేహాన్ని తీసుకువెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. నారాయణ రెడ్డి అదృశ్యమైనట్లుగా కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కాల్ డేటాను విశ్లేషించి కూపీ లాగడంతో ఆశిక్ చిక్కాడు. అతడిని విచారించగా పరువు హత్యగా తేలింది. యువతి తండ్రి వెంకటేశ్వరరెడ్డిని గిద్దలూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.