భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ) యూనివర్సిటీ హాస్టల్‌లో నేపాల్‌కు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సోమవారం భారీ నిరసనలు చెలరేగాయి. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ప్రకృతి లాంసాల్ ఆదివారం సాయంత్రం తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. నేపాలీ జాతీయులతో సహా పలువురు నిరసనలకు దిగారు. నేపాలీ విద్యార్థులను క్యాంపస్‌ను ఖాళీ చేయమని యూనివర్సిటీ అధికారులు ఏకపక్షంగా ఆదేశించారని ఆరోపించారు. విచారణలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.
అద్విక్ శ్రీవాస్తవ అనే వ్యక్తి వేధింపులే ఆమె ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయని ప్రకృతి స్నేహితులు ఆరోపించారు. వందలాది మంది విద్యార్థులు క్యాంపస్‌లో గుమిగూడి, "వి వాంట్ జస్టిస్" అంటూ నినాదాలు చేశారు. ఈ సంఘటనపై విశ్వవిద్యాలయ పరిపాలన యంత్రాంగం సరైన నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు. నేపాల్ తో సహా ఇతర దేశాల విద్యార్థులందరూ క్యాంపస్‌ను ఖాళీ చేయమని యూనివర్సిటీ అధికారులు ఆదేశించారు. అయితే విద్యార్థులు ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు. బాధితురాలు తన మాజీ ప్రియుడితో వచ్చిన విబేధాల కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకోడానికి దారితీసిందని పోలీసులు తెలిపారు.