దారుణం.. మయన్మార్‌కు చెందిన మ‌హిళ‌పై ఢిల్లీలో సామూహిక అత్యాచారం

మ‌య‌న్మార్ చెందిన ఓ మ‌హిళ‌పై న‌లుగురు వ్య‌క్తులు ఢిల్లీ న‌గ‌రంలో సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 March 2023 11:36 AM IST
Myanmar-origin woman gang rape, Woman from Myanmar kidnapped,

మయన్మార్‌కు చెందిన మ‌హిళ‌పై ఢిల్లీలో సామూహిక అత్యాచారం

దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో దారుణం చోటు చేసుకుంది. మ‌య‌న్మార్ చెందిన ఓ మ‌హిళ‌పై న‌లుగురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. మ‌య‌న్మార్‌కు చెందిన 21 ఏళ్ల మ‌హిళ త‌న భ‌ర్త‌, రెండున్న‌రేళ్ల కూతురితో క‌లిసి వికాస్ పురి ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఆమె క‌డుపులో నొప్పి, ఫ్లూతో బాధ‌ప‌డుతుండ‌డంతో డాక్ట‌ర్ ను సంప్ర‌దించేందుకు ఫిబ్ర‌వ‌రి 22న కాళింది కుజ్‌కు వెళ్లింది. డాక్ట‌ర్‌ను క‌లిసిన అనంత‌రం దంప‌తులు రాత్రి 9.30 గంట‌ల స‌మ‌యంలో కుంజ్ మెట్రో స్టేష‌న్ వ‌ద్ద‌కు చేరుకున్నారు.

ఆ స‌మ‌యంలో ఆమె భర్త టాయిలెట్‌కు వెళ్లేందుకు రోడ్డు దాటాడు. ఇంత‌లో ఆ మహిళ పక్కనే ఓ ఆటో ఆగింది. గుడ్డ‌తో ఆమె నోటిని బిగ‌ప‌ట్టి కూతురితో పాటు ఆ మ‌హిళ‌ను బ‌ల‌వంతంగా ఆటోలో ఎక్కించాడు ఆటో డ్రైవ‌ర్‌. ఆమె స్పృహ కోల్పోయింది. క‌ళ్లు తెరిచి చూసే స‌రికి ఓ రూమ్‌లో బంధింప బ‌డి ఉంది. తన‌ను కిడ్నాప్ చేశార‌ని, త‌న‌పై అత్యాచారం జ‌రిగింద‌ని ఆమె గుర్తించింది.

మ‌రుస‌టి రోజు ఫిబ్ర‌వ‌రి 23న ఆమెను ఓ మారుమూల ప్రాంతంలో నిందితులు వ‌దిలివేసి వెళ్లిపోయారు. స్థానికుల సాయంతో ఆమె ఇంటి వ‌ద్ద‌కు చేరుకుంది. త‌న‌పై జ‌రిగిన దారుణాన్ని భ‌ర్త‌కు వివ‌రించింది. అనంత‌రం భ‌ర్త‌తో క‌లిసి పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story