73 సంవత్సరాల వ్యక్తి.. తన వృద్ధాప్యంలో తోడుగా ఉంటుందని అనుకున్నాడో ఏమో ఓ మహిళ మాటలను బాగా నమ్మాడు. ఎంతగా అంటే తన దగ్గర ఉన్న సర్వస్వాన్ని అందించేటంత..! 73 ఏళ్ల వయసున్న అతడిని పెళ్లి చేసుకుని అండగా ఉంటానంటూ సదరు మహిళ చెప్పడంతో ఏకంగా కోటి రూపాయలు ఆమె చేతిలో పెట్టేశాడు. చివరికి మోసపోయినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ముంబై లోని మలద్ ప్రాంతానికి చెందిన జెరాన్ డిసౌజా వయసు 73 ఏళ్లు. 2010లో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించగా వచ్చిన రూ. 2 కోట్లను 2019లో ఓ ప్రైవేటు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడు. వడ్డీ రూపంలో వచ్చిన భారీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుని తన వద్దే ఉంచుకున్నాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న షాలినీ కన్ను జెరాన్ డిసౌజాపై పడింది. జెరాన్ డిసౌజా ఏమి చేస్తున్నాడు.. ఎవరెవరు ఉన్నారు అనే విషయాలన్నింటినీ గమనించి.. ఆ డబ్బు కాజేయాలనే పథకాన్ని రచించింది.
వృద్ధుడు ఉపసంహరించుకున్న సొమ్ముని తీసుకోవాలని భావించి..అతడితో నెమ్మదిగా పరిచయం పెంచుకుంది. పెళ్లి చేసుకుని అండగా ఉంటానని నమ్మించింది. వృద్ధాప్యంలో తోడుగా ఉంటుందని అనుకోవడంతో జెరాన్ డిసౌజా చాలా విషయాలను షాలినితో పంచుకున్నాడు. షాలినితో కలిసి రెస్టారెంట్లకు, షికార్లకు తిరిగాడు.
కొద్దిరోజులకు జెరాన్ తనను నమ్ముతూ ఉన్నాడని భావించి.. నెక్స్ట్ స్టెప్ వేసింది. తానో వ్యాపారం ప్రారంభిస్తున్నానని, అందులో పెట్టబడి పెడితే వచ్చే లాభాల్లో చెరిసగం తీసుకుందామని చెప్పింది. కాబోయే భార్యే కాబట్టి జెరాన్ రూ. 1.3 కోట్లను గతేడాది డిసెంబరులో ఆమె ఖాతాలో వేశాడు. అప్పుడే ఆమె నిజస్వరూపం చూపించింది. డబ్బు తన ఖాతాలోకి వేయించుకోగానే షాలిని జెరాన్ ను దూరం పెట్టింది. తన ఫోన్ స్విచ్చాఫ్ చేయడమే కాకుండా.. బాధిత వృద్ధుడు ఆమెను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో మోసపోయానని తెలుసుకున్న జెరాన్ గత డిసెంబరులోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె మోసం చేసిందని నిర్ధారించుకున్నారు. తాజాగా కేసు నమోదు చేశారు.