లండన్‌లో చ‌దివాడు.. క్రిమినల్ సైకాలజీలో డిగ్రీ చేశాడు.. రూ.1128 కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ ముఠా నాయకుడు అత‌డు..!

ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ బట్టబయలైంది. ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  4 March 2025 4:41 PM IST
లండన్‌లో చ‌దివాడు.. క్రిమినల్ సైకాలజీలో డిగ్రీ చేశాడు.. రూ.1128 కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ ముఠా నాయకుడు అత‌డు..!

ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ బట్టబయలైంది. ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. డ్రగ్ రాకెట్లు అమెరికా, ఆస్ట్రేలియాలతో కూడా ముడిపడి ఉన్నాయి. ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) దర్యాప్తులో ఈ డ్రగ్స్ అమెరికా నుండి ఎయిర్ కార్గో ద్వారా దిగుమతి అయినట్లు తేలింది. ఈ ముఠాతో సంబంధమున్న వారందరూ విద్యావంతులే. వారు ఈ సరుకును దేశమంతటా అమ్మేవారు.

ఎన్‌సీబీ విచారణ ప్రకారం.. ఈ ముఠా గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా రూ.1128 కోట్ల విలువైన డ్రగ్స్ విక్రయించింది. అరెస్టయిన ఆరుగురిలో ముగ్గురు విదేశాల్లో చదువుకున్నవారే. ఈ ముఠా నాయకుడు నవీన్ చిచ్కర్ నవీ ముంబై నివాసి. అయితే ప్రస్తుతం నవీన్ విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. నవీన్ తన సహచరుల ద్వారా మొత్తం గ్యాంగ్‌ను నడుపుతున్నాడు.

నవీ ముంబై నుంచి 4.9 కిలోల హైబ్రిడ్ స్ట్రెయిన్ హైడ్రోపోనిక్ వీడ్, 11.540 కిలోల కొకైన్, 200 ప్యాకెట్ల గంజాయి గమ్మీలు, 1.5 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హెచ్ పటేల్, హెచ్ మానేలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరూ హవాలా ఆపరేటర్లు.

నవీన్ తన ముఠా ద్వారా హైబ్రిడ్ డ్ర‌గ్స్‌, హైడ్రోపోనిక్ వీడ్‌ను విక్రయించేవాడని విచారణలో తేలింది. మొదట్లో అమెరికా నుంచి ముంబైకి ఎయిర్ కార్గో ద్వారా డ్రగ్స్ రవాణా అయ్యేవి. ఆ తరువాత దేశవ్యాప్తంగా ముఠాలు వీటిని విక్ర‌యించేవి. ఈ ముఠా ఆస్ట్రేలియాకు కూడా డ్రగ్స్‌ పంపేవారని విచారణలో తేలింది.

నిందితులు రెండేళ్లలో దాదాపు 60 కిలోల హైబ్రిడ్ స్ట్రెయిన్ హైడ్రోపోనిక్ వీడ్‌, 80-90 కిలోల కొకైన్‌ను ఆర్డర్ చేశారు. సమాచారం అందుకున్న ఎన్‌సీబీ అధికారులు చర్యలు చేపట్టి ముఠా గుట్టు రట్టు చేశారు. గ్యాంగ్ లీడర్ నవీన్ చాలా దుర్మార్గుడు. విదేశాల్లో చదువుకున్నాడు. నవీన్ క్రిమినల్ సైకాలజీ కూడా చదివాడు. లండన్ నుంచి ఫిల్మ్ అండ్ టెలివిజన్‌లో కోర్సు కూడా చేసిన‌ట్లు విచార‌ణ‌ల తేలింది.

Next Story