దారుణం.. ఇద్దరు చిన్నారులను వాగులో పడేసిన తల్లి
Mother threw her two children into the river.కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులను వాగులో
By తోట వంశీ కుమార్ Published on 27 Dec 2022 11:56 AM IST
దంపతుల మధ్య గొడవలు జరగడం సహజం. కొన్ని రోజులు అలకలు, బుజ్జగింపులు ఉంటాయి. దంపతుల్లో ఎవరో ఒకరు తగ్గితే అంతా సవ్యంగా ఉంటుంది. లేదంటో ఆ కాపురం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. భార్య భర్తల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా ఏమీ తెలియని ఇద్దరు చిన్నారులు మరణించారు. కన్నతల్లే చిన్నారులను వాగులోకి విసిరేసింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని ఉద్గీర్‌కు చెందిన మోహన్‌కు నిజామాబాద్ జిల్లా నాగారం సమీపంలోని చక్రనగర్ తండాకు చెందిన అరుణతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమారై సంతానం. కొద్ది రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో అరుణ పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో భర్త ఉద్గీర్ ఫోన్ చేసి రావాలని భార్యను కోరాడు. దీంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పుట్టింటి నుంచి పిల్లలను తీసుకుని అరుణ బయలుదేరింది.
బాన్సువాడ శివారులో ఉన్న వాగు వద్దకు వెళ్లింది. అక్కడ చిన్నారులు ఇద్దరిని వాగులో పడేసింది. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై చిన్నారులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే వారు మరణించారు అని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ఆరా తీశారు.
నిజామాబాద్ నుంచి ఆటోలో వస్తుండగా డ్రైవర్ తనపై అఘాయిత్యం చేశాడని, పిల్లలను వాగులో పడేసి పారిపోయినట్లు వారికి అరుణ చెప్పింది. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా వాగు వద్ద ఆటోకానీ, డ్రైవర్ గానీ కనిపించలేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.