వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తోందని.. కూతురిని గొంతు కోసి చంపిన తల్లి

Mother kills daughter for being in love with man from another caste in Tamilnadu. తమిళనాడులోని తిరునెల్వేలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తోందన్న కార

By అంజి  Published on  24 Nov 2022 2:37 PM IST
వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తోందని.. కూతురిని గొంతు కోసి చంపిన తల్లి

తమిళనాడులోని తిరునెల్వేలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తోందన్న కారణంతో తన 19 ఏళ్ల కుమార్తెను ఓ తల్లి హత్య చేసింది. ఆ తర్వాత తల్లి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ పొరుగువారు రక్షించి ఆసుపత్రిలో చేర్చారు. ఆరుముగ కని అనే మహిళ సివల్‌పేరి గ్రామంలో నివసిస్తోంది. చెన్నైలో డ్రైవర్‌గా పనిచేస్తున్న పిచాయ్‌ అనే వ్యక్తితో ఆమెకు వివాహమైంది. వీరిద్దరికీ 19 ఏళ్ల కూతురు అరుణ ఉంది.

అరుణ దగ్గర్లోని పట్టణంలో నర్సింగ్ చదువుతోంది. ఈ క్రమంలోనే తాను వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తున్నానని తల్లి వద్ద చెప్పింది. తేవర్ కమ్యూనిటీకి చెందిన అరుణ నాడార్ వర్గానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉంది. ఈ విషయం మాట్లాడాలనే నెపంతో అరుణను ఆమె తల్లి ఆరుముగ కని స్వగ్రామానికి పిలిపించింది. అరుణ ఇంటికి వెళ్ళినప్పుడు, తన తల్లి తన కులంలోనే తనకు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయించిందని తెలుసుకుని ఆశ్చర్యపోయింది.

నవంబర్ 23 బుధవారం నాడు వరుడి కుటుంబీకులు ఆరుముగ కని ఇంటికి వెళ్లేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే అరుణ మొండిగా వ్యవహరించి తాను వేరొకరితో ప్రేమలో ఉన్న విషయాన్ని వరుడి కుటుంబీకులకు చెబుతానని తల్లికి చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన తల్లి ఆరుముగ కని ఆవేశంతో అరుణను గొంతుకోసి హత్య చేసింది. తన కూతురిని హత్య చేశాక తల్లి ఆరుముగ కని ఆత్మహత్యకు ప్రయత్నించి హెయిర్ డై పౌడర్ తాగింది. అయితే ఇరుగుపొరుగు వారు ఆమెను రక్షించి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స పొందుతున్నారు. శివలపేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story