మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఓ తల్లి తన కూతురికి విషమిచ్చి తాను ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కుత్బుల్లాపూర్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో నివాసముంటున్న ఓ మహిళ తన నాలుగు సంవత్సరాల కూతురికి విషమిచ్చి తాను కూడా విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్త ఇంట్లో లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టింది. అయితే కొద్దిసేపటి తర్వాత భర్త ఇంటికి వచ్చేసరికి కిందపడిపోయి ఉన్న ఇద్దరిని తీసుకొని వెంటనే స్థానిక హాస్పిటల్ కి తరలించాడు.
కానీ కూతురు అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆమెను కూకట్‌పల్లి ప్రసాద్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది .అయితే ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నందున ఆత్మహత్యకు యత్నించినట్టు తెలిసిందని బాచుపల్లి పోలీసులు తెలిపారు. పోలీసులు కూతురు మృతదేహాన్ని పోస్టుమార్టం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.