అర‌కులోయలో విషాదం.. ముగ్గురు పిల్లలు సహా తల్లి అనుమానాస్పద మృతి

Mother and three children suicide in Araku Valley.అరకులోయ‌లో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు చిన్నారుల‌తో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2021 8:35 AM IST
అర‌కులోయలో విషాదం.. ముగ్గురు పిల్లలు సహా తల్లి అనుమానాస్పద మృతి

అరకులోయ‌లో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు చిన్నారుల‌తో స‌హా త‌ల్లి అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందింది. తల్లి ఓ గదిలో ఉరి వేసుకొని చనిపోగా.. ముగ్గురు చిన్నారులు మరో గదిలో మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. వివ‌రాల్లోకి వెళితే.. అరకులోయ పట్టణ పరిధిలోని పాత పోస్టాఫీస్‌ కాలనీలో సంజీవ్‌, సురేఖ‌(28) దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరికి కుమారై సుశాన‌(9), కుమారులు ష‌ర్విన్‌(6), సిరిల్‌(4) సంతానం. గిరిజ‌న స‌హ‌కార సంస్థ‌లో ఒప్పంద సేల్స్‌మెన్‌గా సంజీవ్ ప‌నిచేస్తున్నాడు. కాగా.. గ‌త కొద్ది రోజులుగా భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి.

శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో సంజీవరావు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి 10 గంట‌ల స‌మయంలో ఇంటికి వ‌చ్చాడు. ముగ్గురు చిన్నారులు మంచంపై విగ‌త‌జీవులుగా క‌నిపించ‌గా.. భార్య మ‌రో గ‌దిలో ఉరికి వేలాడుతూ క‌నిపించింది. స్థానికుల సాయంతో వారిని ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. అయితే.. వారు అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. ముగ్గురు పిల్ల‌ల‌కు విష‌మిచ్చి.. భార్య‌ ఉరివేసుకుంద‌ని భ‌ర్త సంజీవ్ చెబుతున్నాడు. అయితే.. ముగ్గురు పిల్ల‌ల‌ను చంపి.. భార్య‌కు ఉరి వేసి వారిని త‌న అల్లుడే హ‌త్య చేశాడ‌ని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story