హైదరాబాద్ : ఓ కేసులో బాధితురాలితో అసభ్యకరంగా ప్రవర్తించిన మియాపూర్ స్టేషన్ ఎస్ ఐ గిరీష్ కుమార్ పై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో అతడిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో ఎస్సై గిరీష్ కుమార్‌పై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. 2020 బ్యాచ్‌కు చెందిన ఎస్సై గిరీష్ కుమార్ మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ కేసు నిమిత్తం స్టేషన్‌కు వచ్చిన బ్యూటీషియన్‌ను ఎస్‌ఐ వెంబడించి ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది.
దీంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు పోలీస్ కమిషనర్ అవినాష్ మంగళవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాపారం పేరుతో రూ.6 లక్షలు తీసుకుని డబ్బులు తిరిగి ఇవ్వకుండా తన స్నేహితుడు మోసం చేశాడని బాధిత బ్యూటీషియన్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెట్టింది. నిందితుడు తిరిగి డబ్బులు చెల్లించడంతో కేసు ముగిసింది. అయితే బాధిత మహిళ పట్ల ఎస్‌ఐ గిరీష్‌కుమార్ దురుసుగా ప్రవర్తించారు. వెంటాడి వేధించడంతో బాధిత మహిళ నేరుగా సీపీకి ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో ఇదంతా నిజమని తేలడంతో ఎస్‌ఐ సస్పెన్షన్‌కు గురయ్యారు.