సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చేర్యాల మండలం గుర్జకుంట గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున బీఆర్‌ఎస్ చేర్యాల్ జెడ్పీటీసీ మల్లేశంపై గుర్తు తెలియని కొందరు దుండగులు దాడి చేశారు. వాకింగ్‌కు వెళ్లిన సమయంలో నిందితులు జెడ్పీటీసీ మల్లేశంపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో అతడి తలకు బలమైన గాయమైంది. స్పృహ కోల్పోయి రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని గ్రామస్తులు గమనించారు. వెంటనే అతడిని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
రియల్ ఎస్టేట్ గొడవలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు ఆధారాలు సేకరించారు. గుర్జకుంట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు మల్లేశం భార్య గతంలో గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో చేర్యాల జెడ్పీటీసీగా మల్లేశం ఎన్నికయ్యారు. ఇటీవల స్థానికంగా రాజకీయ గొడవలు, భూతగాదాలు జరుగుతున్నాయని ఈ క్రమంలోనే మల్లేశంను కొందరు హత్య చేశారని స్థానికులు చర్చించుకుంటున్నారు.