ఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. పసిమొగ్గలు మొదలుకొని పండు ముసలివాళ్ల వరకు ఎవ్వరిని కామాంధులు విడిచిపెట్టడం లేదు. కన్నతల్లి ముందే మైనర్ కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 15 ఏళ్ల మైనర్ బాలిక తన కుటుంబంతో కలిసి డుంకా జిల్లాలోని తీన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్హర్ తోలిలో నివాసం ఉంటోంది. ఆదివారం రాత్రి తల్లీ, బాధితురాలు ఇద్దరు కలిసి డియోఘర్‌లో జరిగిన ఓ ఫంక్షన్ కు వెళ్లారు. అనంతరం కాలినడకన తిరుగుప్రయాణం అయ్యారు. మధుపూర్ ప్రాంతంలో రెండు ద్విచక్రవాహనాల మీద ఐదుగురు దుండగులు తల్లీ, కూతురుని వెంబడించారు. వారితో గొడవపడ్డారు.
బాలికను బలవంతంగా పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. కూతురిపై జరుగుతున్న దారుణాన్ని ఆపేందుకు తల్లి విశ్వప్రయత్నం చేసింది. ఆమెను దారుణంగా కొట్టారు. అనంతరం వారి వద్దనున్న సెల్‌ఫోన్‌ను లాక్కొని పారిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు కోసం గాలింపు ముమ్మరం చేశారు.