దారుణం.. మైనర్ బాలికపై పలుమార్లు అన్నదమ్ముల అత్యాచారం.. వీడియోలు తీసి
Minor girl Molested by neighbour brothers in Warangal.ఇద్దరు అన్నదమ్ములు ఇంటి పక్కన ఉన్న ఓ మైనర్ బాలికపై
By తోట వంశీ కుమార్
ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికి మహిళలపై దాడులు ఆగడం లేదు. ఇద్దరు అన్నదమ్ములు ఇంటి పక్కన ఉన్న ఓ మైనర్ బాలికపై ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బాలికను బెదిరిస్తూ పలు మార్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో 15 ఏళ్ల బాలిక తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. పదో తరగతి వరకు చదువుకున్న ఆ బాలిక ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. అదే కాలనీలో ఉంటున్న అన్నదమ్ములైన అజ్మద్ అలీ(26), అబ్బు(22)లు ఆ బాలికతో పరిచయం పెంచుకున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరు ఆ బాలికతో మాట్లాడేవారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అన్నదమ్ములు ఇద్దరు ఒకరి తెలియకుండా మరొకరు బాలికను ఇంటికి తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు తీశారు. మాట వినకుంటే వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బాలికను బెదిరించి ఒకరికి తెలియకుండా మరొకరు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇటీవల ఇద్దరు అన్నదమ్ములు బాధిత బాలికకు సైగలు చేయడం బాలిక తల్లి పలుమార్లు గమనించింది. అనుమానం వచ్చి బాలికను ప్రశ్నించింది. తొలుత బాలిక ఏమీ సమాధానం చెప్పలేదు. తరువాత తల్లి కాస్త గట్టిగా అడగడంతో ఏడుస్తూ మొత్తం విషయం చెప్పేసింది.
వెంటనే బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. అన్నదమ్ములు ఇద్దరిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు అజ్మద్ అలీ, అబ్బుపై ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.