Hyderabad: మైనర్ బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారం.. నందనవనంలో ఉద్రిక్తత
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన జరిగింది. 16 ఏళ్ల బాలికపై ఆమె ఇంట్లో ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 22 Aug 2023 1:00 PM ISTHyderabad: మైనర్ బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారం.. నందనవనంలో ఉద్రిక్తత
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన జరిగింది. 16 ఏళ్ల బాలికపై ఆమె ఇంట్లో ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మంగళవారం పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలి ఇంట్లోకి చొరబడిన నిందితుడు ఆమె సోదరుడిని, మరో ముగ్గురు పిల్లలను బెదిరించి కత్తితో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎనిమిది మంది యువకులు ఇంట్లోకి చొరబడ్డారు. నిందితుల్లో నలుగురు బాధితురాలిని భవనంలోని మూడో అంతస్తుకు తీసుకెళ్లగా, మిగిలిన వారు ఆమె సోదరుడిని, ఇంట్లో ఉన్న మరో ముగ్గురు పిల్లలను బెదిరించారు. బాధితురాలిని పైకి తీసుకెళ్లిన నలుగురు నిందితుల్లో ముగ్గురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో వారు పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం సఖి కేంద్రానికి తరలించారు.
నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఏడు బృందాలను ఏర్పాటు చేసి.. చివరికి నిందితులను పట్టుకున్నారు. మైనర్ బాలిక వైద్య పరీక్షలు పూర్తి చేశామని, ఇంకా మెడికల్ రిపోర్ట్ రావాల్సి ఉందని మీర్‌పేట్ పోలీసులు తెలిపారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అత్యాచారం చేసిన నిందితులు గంజాయి బ్యాచ్ అని గుర్తించామని మీర్ పేట్ పోలీసులు తెలిపారు. దళితురాలైన బాధితురాలు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ గార్మెంట్ షాపులో ఉద్యోగం చేస్తుండగా, ఆమె తమ్ముడు ఫ్లెక్సీలు అమర్చడంలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం తల్లిదండ్రులను కోల్పోవడంతో కాలనీకి మారి బంధువుల వద్ద నివాసం ఉంటున్నారు. మరోవైపు నందనవనం కాలనీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాధిత బాలికకి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్, బిజెపి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని రోడ్డుపై బైఠాయించి మైనర్ బాలికకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు.
మహిళల కోసం ఎన్నో చట్టాలు వచ్చినా కూడా వాటన్నిటిని లెక్క చేయకుండా సమాజంలో కొంతమంది కామాంధులు నీచంగా ప్రవర్తిస్తున్నారని ఇలాంటి వారికి ఎన్కౌంటరే గతి అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్భయ, పోక్కో వంటి కఠినమైన చట్టాలను తీసుకువచ్చినా కూడా కామాందుల్లో ఎటువంటి మార్పు రావడం లేదు. పట్టణాల్లో రోజు రోజుకి మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. బాధిత బాలికకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు, నేతలు ఆందోళన చేపడుతూ ఉండడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలు నేతలకు మధ్య తోపులాట జరగడంతో అక్కడ ఉధృత పరిస్థితి నెలకొంది. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆందోళనకారులను అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులు మహిళా కార్యకర్తలను సైతం ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. పోలీసులు మహిళల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం ఏంటి అంటూ మహిళా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.