అమ్మవారి అవతారాన్నంటూ.. చెల్లి తల నరికిన బాలిక
Minor girl beheads 9-year-old sister in Rajasthan. తాను దశ మాత అమ్మవారినంటూ ఓ 15 ఏళ్ల బాలిక వీరంగం చేసింది. అంతటితో ఆగకుండా తన చెల్లిని నరికి చంపింది. ఈ ఘటన
By అంజి Published on 2 Aug 2022 10:30 AM ISTతాను దశ మాత అమ్మవారినంటూ ఓ 15 ఏళ్ల బాలిక వీరంగం చేసింది. అంతటితో ఆగకుండా తన చెల్లిని నరికి చంపింది. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. దుంగార్‌పూర్‌లోని ఓ గిరిజన గ్రామంలో జింజ్వా ఫాలలో మైనర్ బాలిక తన తొమ్మిదేళ్ల చెల్లిని పొట్టనబెట్టుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 15 ఏళ్ల బాలిక, ఆమె కుటుంబ సభ్యులు వారి ఇంట్లోని ఓ గదిలో దశ మాతకు పూజలు చేస్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. ఉన్నట్టుండి.. ఒక్కసారిగా అమ్మవారి దగ్గర ఉన్న కత్తిని తీసుకుని బాలిక వీరంగం సృష్టించిందని చితారి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో గోవింద్ సింగ్ తెలిపారు.
''బాలిక కత్తి పట్టుకుని ఊగిపోయింది. ప్రజలను చంపేస్తానని బెదిరించింది. ఆమెను అదుపు చేయడానికి ప్రయత్నించిన కుటుంబ సభ్యులను కూడా గాయపర్చింది. ఆమెను పట్టుకునేందుకు ఆమె తండ్రి శంకర్‌తో పాటు అతడి అన్న సురేష్ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత బాలిక మరో గదిలో నిద్రిస్తున్న తన చెల్లి వర్షను తల నరికి చంపేసింది'' అని గోవింద్ సింగ్ చెప్పాడు. బాలిక 10వ తరగతి చదువుతోందని, హాస్టల్‌లో ఉంటోందని సగ్వారా సర్కిల్ ఆఫీసర్ నర్పత్ సింగ్ తెలిపారు.
కొన్ని రోజుల క్రితమే ఆమె తన ఇంటికి వచ్చింది. ఉదయం పూజలు చేస్తుండగా ఆమె ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆమె అసాధారణంగా ప్రవర్తించిందని, ఆమెకు చికిత్స అవసరమని తెలిపారు. పూజ కారణంగా ఆమె రెండు రోజులుగా ఏమీ తినలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. సాక్ష్యాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందాన్ని పిలిపించామని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపామని ఎస్‌హెచ్‌ఓ సింగ్ తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు.