జార్ఖండ్‌లోని హుస్సేనాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల దళిత బాలికను ఆమె ఇంటి నుండి కిడ్నాప్ చేసి ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. నిందితులు ఈ ఘటనను వీడియో తీసి వైరల్ చేస్తామంటూ బాధితురాలిని బెదిరించారు. ఈ సంఘటన హుస్సేనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాలమూలో జరిగింది. గురువారం అర్థరాత్రి మైనర్ బాలిక తన తల్లిదండ్రులు వివాహ వేడుకకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఆమె ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి ఆమెను అపహరించారు.
ఆమెను అపహరించిన తర్వాత నిందితులు ఆమెను గ్రామం వెలుపలికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం నాడు ఆమె తల్లిదండ్రులు పెళ్లికి వెళ్లి వచ్చిన తర్వాత తనకు జరిగిన బాధను వారితో చెప్పగా, వారు విషయాన్ని గ్రామస్థులకు, పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులు నిందితుల్లో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా, మిగిలిన ఐదుగురు గ్రామం నుంచి పరారయ్యారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులంతా బాధితురాలి ఇంటి పరిసరాల్లోనే ఉంటున్నారు.
మిగిలిన నిందితులను పట్టుకునేందుకు దాడులు నిర్వహిస్తున్నామని, నిందితులపై పోక్సో చట్టంతో సహా కేసు నమోదు చేస్తామని, బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని హుస్సేనాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి జగ్నాథ్ ధన్ తెలిపారు.