పాల డబ్బులు ఇవ్వలేదని గర్భిణీపై దాడి.. గర్భస్రావం కావడంతో..

Milkman assaults residents including a pregnant woman in chhattisgarh. పాల డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో విక్రయదారుడు నిండు గర్భిణీని కొట్టాడు.

By అంజి  Published on  1 Jan 2023 12:30 PM GMT
పాల డబ్బులు ఇవ్వలేదని గర్భిణీపై దాడి.. గర్భస్రావం కావడంతో..

పాల డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో విక్రయదారుడు నిండు గర్భిణీని కొట్టాడు. దీంతో ఆ మహిళకు గర్భస్రావం జరిగింది. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సీతాపూర్‌లోని బర్బహ్లా గ్రామంలో చోటు చేసుకుంది. మహిళ, ఆమె బంధువుల ఫిర్యాదు మేరకు సీతాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాల విక్రయదారుడు నారాయణ్‌ యాదవ్‌తో పాటు అతని ఇద్దరు కుమారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

డిసెంబర్ 29న నారాయణ్ యాదవ్ కుమారుడు ఈశ్వర్ యాదవ్ పాల డబ్బులు రూ.2100 ఇవ్వాలని విజయ్ సోని అనే యువకుడి ఇంటికి వచ్చాడు. అయితే విజయ్ ఇంట్లో లేకపోవడంతో తల్లి ఈశ్వర్ యాదవ్‌ను మరుసటి రోజు రావాలని కోరింది. అయితే వెంటనే డబ్బులు ఇవ్వాలని ఈశ్వర్ డిమాండ్ చేయడంతో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఇంతలోనే నారాయణ్ యాదవ్, అతని ఇద్దరు కుమారులు విజయ్ సోనీ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న వ్యక్తులను కొట్టారు. అదే సమయంలో ఇంటికి వచ్చిన నిండు గర్భిణిని కూడా నిందితుడు కొట్టాడు. నిందితు దారుణంగా కొట్టడంతో మహిళకు గర్భస్రావం అయింది. ఆ తర్వాత ఆ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Next Story