Medak: రెండో భార్య మోజులో పడి.. మొదటి భార్యను కడతేర్చిన భర్త

ఓ సోగ్గాడికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ ఆ వ్యక్తి రెండో భార్య మోజులో పడి మొదటి భార్య మీద విరక్తి పొందాడు.

By అంజి  Published on  11 Aug 2023 12:00 PM IST
Medak, Crime news, Timmakka Palli Tanda

Medak: రెండో భార్య మోజులో పడి.. మొదటి భార్యను కడతేర్చిన భర్త

ఓ సోగ్గాడికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ ఆ వ్యక్తి రెండో భార్య మోజులో పడి మొదటి భార్య మీద విరక్తి పొందాడు. పక్కా ప్లాన్ ప్రకారం.. భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. కాగా మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. మెదక్ మండలంలోని తిమ్మక్క పల్లి తండాలో నివాసం ఉంటున్న రమేష్ అనే వ్యక్తికి స్వరూప అనే మహిళతో 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే ఇటీవల రమేష్ తన మొదటి భార్యకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్య ప్రేమ ఉచ్చులో చిక్కుకున్న రమేష్ మొదటి భార్య స్వరూపను పట్టించుకోవడం మానేశాడు.

భర్తలో వచ్చిన మార్పును చూసి స్వరూప ఆరా తీసింది. దీంతో విషయం తెలియడంతో స్వరూప వెంటనే భర్త రమేష్‌ని నిలదీసి అడిగింది. రెండో పెళ్లి కారణంగా రమేష్, స్వరూపల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో విసుకు చెందిన రమేష్ ఎలాగైనా సరే తన మొదటి భార్య స్వరూపని చంపేయాలని పక్కా స్కెచ్ వేశాడు. అటు పోలీసులకు కానీ.. ఇటు స్వరూప తల్లిదండ్రులకు కానీ.. ఎటువంటి అనుమానం రాకుండా పథకం రచించాడు. ఈ పథకంలో భాగంగానే రమేష్ ఈనెల ఆరవ తేదీన పొలం పనుల కోసమని భార్య స్వరూపను పొలం దగ్గర ఉన్న బావి దగ్గరకు తీసుకువెళ్లి బలవంతంగా ఆమె చేత పురుగుల మందు తాగించాడు.

అనంతరం స్వరూప తల్లిదండ్రులకు ఫోన్ చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కల్లబొల్లి కన్నీరు కారుస్తూ వారిని నమ్మించాడు. అనంతరం స్వరూపను గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఈనెల తొమ్మిదవ తేదీన సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ చికిత్స పొందుతున్న స్వరూప మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్వరూప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. పోలీసులు తమ దర్యాప్తులో భర్తే అసలు నిందితుడిగా గుర్తించారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా పికెటింగ్ ఏర్పాటు చేశారు.

Next Story